తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada Murder: విజయవాడలో ఘోరం.. ప్రాణస్నేహితుడే ప్రాణం తీశాడు.. క్షణికావేశంలో స్నేహితుడి హత్య

Vijayawada Murder: విజయవాడలో ఘోరం.. ప్రాణస్నేహితుడే ప్రాణం తీశాడు.. క్షణికావేశంలో స్నేహితుడి హత్య

23 October 2024, 7:30 IST

google News
    • Vijayawada Murder: మద్యం మత్తులో ప్రాణస్నేహితుడే మిత్రుడి ప్రాణం తీసిన ఘటన విజయవాడలో జరిగింది. మంగళవారం రాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని లోటస్ ల్యాండ్ మార్క్‌‌ విల్లాల్లో అర్థరాత్రి తర్వాత జరిగిన హత్యపై నిందితుడే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 
క్షణికావేశంలో ప్రాణస్నేహితుడిని హత్య చేసిన మిత్రుడు
క్షణికావేశంలో ప్రాణస్నేహితుడిని హత్య చేసిన మిత్రుడు

క్షణికావేశంలో ప్రాణస్నేహితుడిని హత్య చేసిన మిత్రుడు

Vijayawada Murder: మద్యం మత్తులో చిన్నపాటి వాగ్వాదంతో ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన విజయవాడలో జరిగింది. హైదరాబాద్‌లో స్థిరపడిన ఫార్మా వ్యాపారి చేతిలో అతని స్నేహితుడు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. క్షణికావేశంలో జరిగిన హ‍త్యతో కంగారు పడిన నిందితుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయాడు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.

ఇద్దరూ చిన్నప్పటి స్నేహితులు. ఒకే చోట కలిసి చదువుకున్నారు. చదువు పూర్తై చెరో చోట నివాసం ఉంటున్నారు. వయసు పెరిగినా వారి స్నేహం కొనసాగుతూనే ఉంది. యాభై ఇళ్లు దాటిన తర్వాత కూడా బాల్య మిత్రులు అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చి వ్యక్తి అనూహ్యంగా హత్య కేసులో చిక్కుకున్నాడు.

హైదరాబాద్‌లో స్థిర పడిన సాగి వెంకట నరసింహరాజు (54) చిన్నతనంలో విజయవాడలో చదువుకున్నాడు. చదువు పూర్తైన తర్వాత ఆయన కుటుంబంతో సహా హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. నరసింహరాజు తనతో పాటు చదువుకున్న ఎండీ రఫీ (54)తో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. విజయవాడ ఎప్పుడు వచ్చినా స్నేహితుడిని కలిసేవాడు.

సోమవారం సాయంత్రం నగరానికి వచ్చిన నరసింహరాజు మిత్రుడు రఫీకి ఫోన్‌ చేసి విజయవాడ వచ్చినట్టు చెప్పాడు. లోటస్ ల్యాండ్‌ మార్క్‌లో ఉన్న తన ఫ్లాట్లో ఉన్నానని చెప్పడంతో రఫీ అక్కడకు మద్యం తీసుకుని వెళ్లాడు. అర్ధరాత్రి వరకు ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో తనకు రూ.3లక్షల అప్పు కావాలని రఫీ అడగడంతో అందుకు అంగీకరించాడు. ఆ తర్వాత డబ్బు విషయం మాట్లాడుతూ అనవసం డబ్బులు పాడు చేస్తున్నావని మందలించాడు. దీంతో ఆగ్రహానికి గురైన రఫీ వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

మాటా మాట పెరిగి రఫీ పక్కనే ఉన్న కత్తెరతో నరసింహరాజుపై దాడికి ప్రయత్నించాడు. దీంతో నరసింహరాజు టవల్‌తో రఫీ మెడకు చుట్టి బలంగా బిగించి పట్టుకున్నాడు. దీంతో ఊపిరాడక రఫీ అక్కడికక్కడే మృతి చెందాడు. నరసింహరాజు జరిగిన విషయాన్ని పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌కు తెలియ చేయడంతో అజిత్‌ సింగ్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

నిందితుడు సాగి వెంకట నరసింహరాజు హైదరాబాద్‌లో ఫార్మా దుకాణాలను నిర్వహిస్తున్నట్టు పోలీసులకు తెలిపాడు. విజయవాడ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఫ్లాట్‌కు అప్పుడప్పుడు వస్తుంటానని పోలీసులకు వివరించాడు. యనమలకుదురుకు చెందిన మహ్మద్ రఫీ (54) చిన్ననాటి స్నేహితుడని చిన్న విషయంలో జరిగిన గొడవలో మద్యం మత్తులో హత్య జరిగినట్టు వివరించాడు. అజిత్ సింగ్ నగర్‌ సీఐ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పథకం ప్రకారమే హత్య..

మరోవైపు రఫీ హత్యపై అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగానే హత్య జరిగిందని ఆరోపించారు. పథకం ప్రకారమే ఇంటికి రప్పించి హత్య చేశారని విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

తదుపరి వ్యాసం