SSC| పదో తరగతిలో ఓ అభ్యర్థికి 600 మార్కులు.. మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం!
17 February 2022, 11:00 IST
- తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో పారామెడికల్ అటెండర్ పోస్టుల నియామకంలో గందరగోళం నెలకొంది. పదో తరగతిలో ఓ అభ్యర్థి 600కి 600 మార్కులు వచ్చాయని చూపిచడంతో ఆ పోస్టులో సదరు అభ్యర్థిని నియమించారు.
10వ తరగతిలో 600 మార్కులు
ఎంత చదివినా పదో తరగతి మాత్రం అందరికీ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా టెన్త్ క్లాస్‌లో ఎన్ని మార్కులు వచ్చాయని తెలిసిన వారందరూ అడుగుతూనే ఉంటారు. ఒకప్పుడు 500 పైచిలుకు మార్కులు వచ్చాయంటే పెద్ద గొప్ప. 550 పైగా వచ్చాయంటే వారు టాపర్ అనే అనుకుంటారు. అలాంటిది ఓ వ్యక్తికి 600కి 600 మార్కులు వచ్చాయనే సంగతి మీకు తెలుసా? ఏంటి ఇది నిజమేనా... అసలు సాధ్యమేనా? అని అనుకుంటున్నారా.. అవును తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో పారమెడికల్ అటెండర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఓ అభ్యర్థికి పదో తరగతిలో అక్షరాల ఆరు వందల మార్కులు వచ్చాయి.
ఈ పోస్టులను పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల నియామకం జరుగుతోంది. ఇందులో భాగంగా పదో తరగతిని అర్హతగా నిర్దేశించి దరఖాస్తులను ఆహ్వానించారు. అయితే 2018లో పదో తరగతి పూర్తి చేసిన ఓ అభ్యర్థికి 600 మార్కులొచ్చాయి. దీంతో 600, 582, 574 మార్కులు సాధించిన ముగ్గురు అభ్యర్థులను అటెండర్లుగా ఎంపిక చేశారు. వారు బుధవారం నాడు ఉద్యోగాల్లో చేరారు.
మెరిట్ జాబితాను పరిశీలించిన ఇతర అభ్యర్థులు ఈ విషయంపై అభ్యంతరం తెలిపారు. అసలు 10వ తరగతిలో 100 శాతం మార్కులు ఎలా వస్తాయి? ఇది సాధ్యమయ్యే పని కాదంటూ వారు అనుమానం వ్యక్తం చేశారు. చివరకు ఈ విషయం జిల్లా జాయింట్ కలెక్టర్‌కు చేరింది. పదో తరగతి విద్యార్హత పత్రాల వాస్తవికతను నిర్ధారించేందుకు వాటిని ఎస్ఎస్‌సీ బోర్డుకు పంపాలని నిర్ణయించారు.
ఈ విధంగా ఉద్యోగాలను ఎలా ఇస్తారని పలువురు అభ్యంతరం తెలుపుతున్నారు. పోస్టుల నియామకంలో అవకతవకలు జరుగుతున్నాయని అనుమానిస్తున్నారు.