East Godavari Crime : హాస్టల్ నుంచి తీసుకొచ్చి బాలికపై అత్యాచారం
17 November 2024, 11:40 IST
- ఆధార్ కార్డులో మార్పుల కోసం హాస్టల్ నుంచి తీసుకొచ్చి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పొక్సో కేసు నమోదు చేశారు.
హాస్టల్ నుంచి తీసుకొచ్చి బాలికపై అత్యాచారం
తూర్పుగోదావరి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆధార్ మార్పుల కోసమని బాలికను హాస్టల్ నుంచి తీసుకొచ్చి అత్యాచారానికి ఒడిగట్టాడు ఒక ప్రబుద్ధుడు. నిందితుడు బాలికకు వరుసకు మేనమామ అవుతాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఈ ఘోరమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలంలో ఆలస్యంగా శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలిక నిడదవోలు మండలంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతోంది.
ఆ బాలిక తల్లి జీవనోనపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లింది. దీంతో తండ్రి వేరుగా ఉంటున్నాడు. బాలిక బాగోగులన్నీ తాడేపల్లిగూడెం మండలంలో ఉంటున్న అమ్మమ్మ చూస్తున్నారు. బాలికకు వరుసకు మేనమామ అయిన కమల్ తాడేపల్లిగూడెం మండలంలోనే ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.
అయితే ఇటీవలి ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించడంతో బాలిక ఆధార్‌కార్డును అప్‌డేట్ చేయాల్సి వచ్చింది. దీంతో ఈనెల 14 (గురువాం) తేదీన బాలిక అమ్మమ్మ ఆటో డ్రైవర్ కమల్‌కు రూ.100 ఇచ్చి అమ్మాయి ఆధార్ కార్డు అప్‌డేట్ చేయించమని పంపించింది. ఆయన నిడదవోలు వెళ్లి బాలిక ఉంటున్న హాస్టల్‌కు వెళ్లాడు. బాలికను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని చాగల్లు మండలంలోని ఆయన తన అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లాడు.
ఆ సమయంలో అమ్మమ్మ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం బాలికను తాడేపల్లిగూడెం మండలంలోని ఆమె అమ్మమ్మ ఇంటి వద్ద వదిలేశాడు. బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంది. దీంతో ఆమె అమ్మమ్మ ఏం జరిగిందని ప్రశ్నించగా, కమల్ చేసిన దుర్మార్గాన్ని తెలిపింది. వెంటనే బాలికను నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు.
ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి చాగల్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు నిడదవోలు ఆసుప్రతి నుంచి సమాచారం కోరారు. నిడదవోలు ఆసుపత్రి ఇచ్చిన సమాచారంతో పాటు బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడి కమల్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.నరేంద్ర తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని.. కేసుపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.