తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Case On Ig Sunil Kumar: ఐపీఎస్‌ అధికారిపై వరకట్న వేధింపుల కేసు నమోదు, 2022లో అయ్యన్నపాత్రుడిని అరెస్ట్‌ చేసిన ఐజీ సునీల్

Case on IG Sunil Kumar: ఐపీఎస్‌ అధికారిపై వరకట్న వేధింపుల కేసు నమోదు, 2022లో అయ్యన్నపాత్రుడిని అరెస్ట్‌ చేసిన ఐజీ సునీల్

Sarath chandra.B HT Telugu

24 July 2024, 12:35 IST

google News
    • Case on IG Sunil Kumar: బీహార్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి సునీల్ కుమార్‌ నాయక్‌పై విజయవాడలో పోలీస్ కేసు నమోదైంది. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ సిఐడిలో సునీల్‌ కుమార్ నాయక్‌ కీలకంగా పనిచేశారు. 
ఐపీఎస్‌ అధికారిపై వరకట్న వేధింపుల కేసు
ఐపీఎస్‌ అధికారిపై వరకట్న వేధింపుల కేసు

ఐపీఎస్‌ అధికారిపై వరకట్న వేధింపుల కేసు

Case on IG Sunil Kumar: అదనపు కట్నం కోసం వేధిస్తున్నారనే ఆరోపణలపై ఐజీ స్థాయి ఐపీఎస్‌ అధికారిపై విజయవాడలో పోలీస్ కేసు నమోదైంది. కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఐపీఎస్‌ అధికారి భార్య, మహిళా వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

విజయవాడ రైల్వే డివిజినల్‌ ఆస్పత్రిలో సీనియర్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం సూర్యారావుపేట పోలీ సులు కేసు నమోదు చేశారు.

ఐజీ సునీల్ భార్య పద్మ.. విజయవాడ రైల్వే డివిజనల్ ఆసుపత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. విజయవాడ రేడియో స్టేషన్‌ రోడ్డులో ఉన్న రైల్వే ఆఫీసర్స్‌ క్వార్టర్లలో నివాసం ఉంటున్నారు. పద్మ భర్త మెఘావత్ సునీల్ కుమార్ నాయక్‌ పట్నాలో ఐజీగా పని చేస్తున్నారు.

సునీల్ కుమార్‌ నాయక్ 2022 వరకు ఏపీలో డిప్యూటేషన్‌పై పనిచేశారు. ఏపీ సిఐడిలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సునీల్ కుమార్‌, పద్మలకు 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

పెళ్ళైనప్పటి నుంచి భర్త సునీల్ కుమార్‌ నాయక్, అత్త మామలు బీకి భాయ్, చిన్న బాధ్యా నాయక్‌లు తనను వేధిస్తున్నారని, మానసికంగా హింసిస్తున్నారని పద్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యా దులో పేర్కొన్నారు. అదనపు కట్నం తీసుకురావాలని, మాటలతో వేధిస్తున్నారని సూర్యారావుపేట పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో భారతీయ న్యాయ సంహిత చట్టం 85, 3, 4 డి. పి.ఎ. సెక్షన్ల కింద ఐపీఎస్ అధికారిపై కేసు నమోదు చేశారు.

మూడేళ్లు డిప్యూటేషన్…

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. 2023 మరో రెండేళ్లు డిప్యూటేషన్ పొడిగించాలని కోరినా క్యాట్ సునీల్ కుమార్ అభ్యర్థన కొట్టేసింది. 2023 మేలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) హైదరాబాద్ బెంచ్ అతని దరఖాస్తును కొట్టివేసింది. క్యాట్‌‌లో దాఖలు చేసిన పిటిషన్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌లను మరో రెండేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు.

2005 బ్యాచ్ IPS అధికారి అయిన సునీల్‌ కుమార్‌ బీహార్‌ క్యాడర్‌కు కేటాయించారు. జనవరి 7, 2020న ఇంటర్-స్టేట్ డిప్యూటేషన్‌పై AP సర్వీస్‌లో చేరాడు. అతని మూడేళ్ల డిప్యుటేషన్ 2023 జనవరి 6తో ముగిసింది. మానవతా దృక్పథంతో డిప్యూటేషన్‌ను రెండేళ్లు పొడిగించాలని కోరుతూ నాయక్ 2022 చివరిలో MHA మరియు DoPT ముందు విజ్ఞప్తి చేశారు.

తన తండ్రి పక్షవాతం, తల్లి క్యాన్సర్‌తో బాధపడుతోందని విజ్ఞప్తి చేశారు. అంతర్రాష్ట్ర డిప్యుటేషన్ గడువు ముగిసిందని, అప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీవ్ అయ్యారని కేంద్ర ప్రభుత్వం ఆయన దరఖాస్తును తిరస్కరించింది. ఆ తర్వాత నాయక్ CAT నుండి మధ్యంతర స్టే ఉత్తర్వులను పొందారు. 2023 ఫిబ్రవరి 17 వరకు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగవచ్చని స్టే విధించారు. అదే ఏడాది మేలో అతని పిటిషన్‌ క్యాట్ కొట్టేసింది.

వైసీపీ అధికారంలో ఉండగా 2022లో టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడి అరెస్ట్ వ్యవహారంలో సునీల్ కుమార్ నాయక్ కీలక పాత్ర పోషించారు. అప్పట్లో సునీల్‌ కుమార్‌పై అయ్యన్న ప్రెస్‌ మీట్ పెట్టి పలు ఆరోపణలు చేశారు. అయ్యన్నపాత్రుడి అరెస్ట్ విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరించామని సునీల్ కుమార్ నాయక్‌ చెప్పారు.

తదుపరి వ్యాసం