తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anna Canteens Reopen : రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ..! 100 రోజుల ప్రణాళిక సిద్ధం, నేటి నుంచే పనులు

Anna Canteens Reopen : రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ..! 100 రోజుల ప్రణాళిక సిద్ధం, నేటి నుంచే పనులు

15 June 2024, 9:23 IST

google News
    • Reopening of Anna Canteens in AP : ఏపీలో టీడీపీ సర్కార్ రావటంతో మళ్లీ అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది.
అన్న క్యాంటీన్లు(ఫైల్ ఫొటో 2018)
అన్న క్యాంటీన్లు(ఫైల్ ఫొటో 2018) (Photo Source From CBN FB)

అన్న క్యాంటీన్లు(ఫైల్ ఫొటో 2018)

Reopening of Anna Canteens in AP : ఏపీలో కొత్త ప్రభుత్వం రావటంతో కీలక నిర్ణయాలు తీసుకునే పనిలో పడింది. ఓవైపు శాఖలవారీగా ప్రక్షాళన చేస్తూనే… మరోవైపు కీలక పథకాలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా… అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది.

అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ ఇవాళ్టి నుంచే మొదలవుతుంది. సెప్టెంబరు 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు.పుర, నగరపాలక సంస్థల కమిషనర్లతో పాటు ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను ఇందులో భాగస్వాములను చేశారు.

2019లో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి.. వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో మంజూరుచేసిన 203 క్యాంటీన్ భవనాల్లో 184 వరకు అప్పట్లో పూర్తయ్యాయి. పాత డిజైన్ మేరకు మిగిలిన వాటి నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం సూచించింది.

పునరుద్ధరణకు కార్యాచరణ ఇదే..

  • జూన్ 15: పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు తమ పరిధిలోని క్యాంటీన్లను పరిశీలించి భవనం తాజా పరిస్థితి, ఫర్నిచర్, ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) పరికరాలు, ఇతర అవసరాలపై ప్రాథమిక నివేదిక రూపొందించాలి.
  • జూన్ 19: క్యాంటీన్ల పునరుద్ధరణకు పాత డిజైన్ ప్రకారం భవన నిర్మాణ పనులకు మున్సిపల్ ఇంజినీర్లు, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో కలిసి కమిషనర్లు అంచనాలు సిద్ధం చేయాలి.
  • జూన్ 30: ఇప్పటికీ భవన నిర్మాణాలు జరగని క్యాంటీన్లకు కొత్తగా పనులు చేపట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కమిషనర్లు స్థలాలను ఎంపికచేయాలి. క్యాంటీన్లలో నిర్వహిస్తున్న వార్డు సచివాలయాలను ఖాళీ చేయించి వాటికి ప్రత్యామ్నాయ భవనాలు చూడాలి.
  • జులై 30: క్యాంటీన్లకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను ఖరారు చేయాలి. ఐఓటీ పరికరాల సమీకరణ, క్యాంటీన్ల పర్యవేక్షణ, స్మార్ట్ బిల్లింగ్, విరాళాల నిర్వహణకు సాఫ్ట్వేర్ కోసం సంస్థలను ఖరారు చేయాలి.
  • అగస్టు 10: క్యాంటీన్ భవన నిర్మాణ పనులు, కొత్తపరికరాలు, సాఫ్ట్వేర్ సమీకరణ, ఇతర మౌలిక సదుపాయాలకు ఏజెన్సీలతో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి.
  • అగస్టు 15: మిగిలిన క్యాంటీన్ భవనాల నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలతో అగ్రిమెంట్ చేయాలి. తాగునీరు, విద్యుత్తు, ఇంటర్నెట్ సహా సదుపాయాలన్నీ కల్పించాలి.
  • సెప్టెంబరు 21: పుర, నగరపాలక సంస్థల్లో 203 క్యాంటీన్లను సెప్టెంబరు 21లోగా ప్రారంభించాలి.

తదుపరి వ్యాసం