తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pinakini Express : రైలు బండికి పుట్టిన రోజు వేడుకలు....

Pinakini Express : రైలు బండికి పుట్టిన రోజు వేడుకలు....

HT Telugu Desk HT Telugu

01 July 2022, 15:23 IST

google News
    • 30ఏళ్ల క్రితం మొదలైన ఓ రైలు సర్వీసుకు దక్షిణ కోస్తా జిల్లాలతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఉదయాన్నే సొంత ఊరిలో బయలుదేరి చెన్నపట్నంలో పని చూసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చేందుకు వీలుగా ఉన్న రైలు ప్రయాణానికి 30ఏళ‌లు నిండాయి. విద్యార్ధులు, ఉద్యోగులు, రైతులు, రైతు కూలీలు ఇలా ఒకరేంటి ఆ రైలుతో చాలామందికి చాలా రకాల అనుబంధం. పేరుకు సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ అయినా రెండు రాష్ట్రాల మధ్య ఆత్మీయ బంధానికి ఆ రైలు అద్దం పడుతుంది.
పినాకిని ఎక్స్‌ప్రెస్‌ 30వ పుట్టినరోజు వేడుకలు
పినాకిని ఎక్స్‌ప్రెస్‌ 30వ పుట్టినరోజు వేడుకలు

పినాకిని ఎక్స్‌ప్రెస్‌ 30వ పుట్టినరోజు వేడుకలు

పినాకిని ఎక్స్‌ప్రెస్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌.... కోస్తా జిల్లాలకు ముఖ్యంగా, కృష్ణా నుంచి నెల్లూరు వరకు ఉన్న జిల్లాలకు చెన్నై మహానగరంతో ఉన్న విడదీయరాని బంధానికి ఈ రైలే నిదర్శనం. మద్రాసు రాష్ట్రం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగమైనా చెన్నపట్నంతో కోస్తా జిల్లాల అనుబంధం సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది. విద్యా, వైద్య, వ్యాపారాల కోసం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తొలి ప్రాధాన్యత చెన్నై నగరమే.

ప్రధానంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం నుంచి సూళ్లురుపేట వరకు ఉన్న దక్షిణ కోస్తా జిల్లాల ప్రధాన నగరాలకు మద్రాసు పట్టణాన్ని ఈ రైలు మరింత చేరువ చేసింది. 1992 జులై 1న మొదలైన పినాకిని ఎక్స్‌ప్రెస్‌ అత్యవసర పరిస్థితులు, వరదలతో రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోయినపుడు మినహా మిగిలిన సమయాల్లో క్షణం కూడా ఆలశ్యం కాదు. విజయవాడ నుంచి నిర్ణీత సమయానికి బయల్దేరి, మళ్లీ అంతే పక్కాగా బెజవాడ తిరిగొచ్చేస్తుంది.

<p>పుట్టిన రోజు వేడుకల కోసం ముస్తాబైన రైలింజన్</p>

బెజవాడ జంక్షన్‌లో రోజువారి నిత్యం ఆరింటికి ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం మీదు ఫుల్ రష్‌ ఉంటుంది. రైలు బయల్దేరే సమయం ఒక్క సెకను కూడా అటుఇటు కాదు. అదే సమయంలో విజయవాడ నుంచి మూడు దిక్కులకు ఇంటర్‌ సిటి ఎక్స్‌ప్రెస్‌లు బయల్దేరుతాయి. వాటిలో మొదటి రైలు చెన్నై వైపు కూత పెడితే, మరొకటి సికింద్రబాద్‌ వైపు, ఇంకో విశాఖవైపు బయల్దేరుతాయి.

విజయవాడలో ఉదయం 6.10 బయల్దేరే 12711పినాకిని ఎక్స్‌ప్రెస్‌ తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, బిట్రగుంట, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేటల మీదుగా చెన్నె చేరుకుంటుంది. విజయవాడ -చెన్నైల మధ్య ఆరున్నర ఏడు గంటల ప్రయాణం. లాక్‌ డౌన్‌ సమయంలో రైల్వే ట్రాక్‌లపై రద్దీ లేకపోయినపుడు ఆరుగంటల్లోనే చెన్నై వెళ్లిపోయేది. 431 కిలోమీటర్ల దూరాన్ని ఆరున్నర గంటల అధిగమించే రైలులో కూర్చునే ప్రయాణించాల్సి ఉంటుంది. ఏసీ ఛైర్‌కార్లు, సెకండ్ సిట్టింగ్‌తో పాటు జనరల్ సిట్టింగ్ ఉంటాయి. అయినా నిత్యం ప్రయాణికులతో నిండుగా ఉంటుంది.

పినాకిని ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ మొదలై 30ఏళ్లు పూర్తవడంతో దానికి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం మీద రైల్వే సిబ్బంది, ప్రయాణికులు, క్రూ కంట్రోల్ సిబ్బంది కేరింతల మధ్య కేక్‌ కట్ చేసి జెండా ఊపారు. 30ఏళ్ల క్రితం రైలు ప్రారంభాన్ని గుర్తు చేసుకుంటూ WAP4 ఇంజిన్‌తో పినాకిని సర్వీస్‌ను నడిపారు. విజయవాడ నుంచి ఎంజిఆర్‌ చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు నిత్యం వందలాది మంది ప్రయాణికులు ఈ రైల్లో రాకపోకలు సాగిస్తుంటారు.

ఉదయం 6.10కు విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు చెన్నై చేరుతుంది. విజయవాడ- నెల్లూరు మధ్య మూడున్నర గంటల ప్రయాణం కావడంతో నిత్యం వందల మంది విద్యార్ధులు ఈ రైల్లో రోజువారి ప్రయాణాలు చేస్తుంటారు. ఇక తెనాలి, నిడుబ్రోలు, చీరాల, ఒంగాలు, సింగరాయకొండ, కావలి, బిట్రగుంట, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉండే ఇంజినీరింగ్ కాలేజీలలో చదివే విద్యార్ధులకు ఈ రైలే ఆధారం. సూపర్‌ ఫాస్ట్‌ వేగంతో గమ్యస్థానాలకు చేరడం దీని ప్రత్యేకత.

ఉదయం పినాకిని వెళ్లి సాయంత్రం అందుబాటులో ఉండే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఇళ్లకు చేరుకునే వారు కోకొల్లలు. ప్రకాశం , నెల్లూరు జిల్లాలకు చెందిన వ్యాపారులైన, పండుగలు, పెళ్లళ్లకు షాపింగ్‌లకు చెన్నై వెళ్లే వారికి ఈ రైలే ఆధారం. డైలీ ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్ అయినా నిత్యం పూర్తి ప్రయాణిస్తుంటుంది. అందుకే 30ఏళ్ల ప్రారంభాన్ని గుర్తు చేసుకుంటూ ఘనంగా రైల్వే స్టేషన్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. దక్షిణ భారతదేశంలో గ్రీన్‌ టాయ్‌లెట్లు ఏర్పాటు చేసిన మొదటి రైలు కూడా ఇదే...

టాపిక్

తదుపరి వ్యాసం