TTD Updates: ఫిట్నెస్ ఉంటేనే తిరుమల కొండపైకి వాహనాలు
02 June 2023, 12:45 IST
- TTD Updates: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్ మెంట్లు నిండి క్యూలైన్ల వెలుపలికి భక్తుల వచ్చారు. సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.56 కోట్లు లభించాయి. శ్రీవారిని 62,407 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,895 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
టీటీడీ ఈవోొ ధర్మారెడ్డి, ఛైర్మన్ సుబ్బారెడ్డి
TTD Updates: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్ మెంట్లు నిండి క్యూలైన్ల వెలుపలికి భక్తుల వచ్చారు. సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.56 కోట్లు లభించాయి. శ్రీవారిని 62,407 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,895 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
మరోవైపు తిరుమల ఘాట్‌రోడ్డులో వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఘాట్ రోడ్ లో ఇటీవల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అలిపిరి చెక్ పోస్ట్ వద్ద వాహనాల ఫిట్నెస్ ను తనిఖీ చేసి కొండకు అనుమతించాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.
అలిపిరి చెక్ పోస్టు తోపాటు పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాల నిర్మాణాలు, శ్రీనివాస సేతు నిర్మాణ పనులను గురువారం సాయంత్రం పరిశీలించారు. భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ అనేక చర్యలు తీసుకుందని చెప్పారు.
తిరుమల కు వచ్చే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి అధునాతన యంత్ర పరికరాలు ఏర్పాటుచేసే అంశంపై నివేదిక అందించాలని సివీఎస్వో ను ఆదేశించామన్నారు. అలిపిరి చెక్ పోస్టు లో వాహనాల తనిఖీ లో ఆలస్యం జరిగి భక్తులు అసహనానికి గురి కాకుండా ఉండడం కోసం వాహనాల తనిఖీ క్యూ లైన్ల సంఖ్యను పెంచనున్నట్లు చెప్పారు. చెక్ పోస్టు లో విజిలెన్స్ సిబ్బంది బాగా తనిఖీలు చేస్తున్నారని, తిరుమలకు వాటర్ బాటిల్స్ తీసుకుని వెళ్లకుండా మరింత పటిష్టంగా తనిఖీలు చేయాలని సూచించారు.
వేగంగా ఆస్పత్రి నిర్మాణం….
చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సుబ్బారెడ్డి చెప్పారు. గత ఏడాది డిసెంబర్ లో పనులు ప్రారంభించారని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది చివర్లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆస్పత్రి ప్రారంభిస్తామని చెప్పారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు, తిరుపతి వాసుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడం కోసం శ్రీనివాస సేతు నిర్మాణానికి టీటీడీ 65 శాతం నిధులు అందిస్తోందన్నారు. గత ఏడాది డిసెంబర్ కు ఫ్లైఓవర్ మొత్తం పూర్తికావాల్సి ఉన్నా, సాంకేతిక కారణాలవల్ల ఆలస్యమైందని చెప్పారు. జూన్ చివరి నాటికి పనులు పూర్తి చేసి జులై లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. నిర్మాణ పనులకు సంబంధించి అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
అంతకు ముందు చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గాలి గోపురం వద్ద ఉన్న దివ్య దర్శనం టోకెన్ల స్కానింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. భక్తుల కోసం గ్లోబల్ ఆసుపత్రి నిర్వహిస్తున్న వైద్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
శ్రీనివాస సేతు నిర్మాణ పనులు 92 శాతం పూర్తయ్యాయని, జూన్ 30వ తేదీకి మిగిలిన 8 శాతం పనులు పూర్తి చేసి జూలై నుండి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి టిటిడి పరిపాల భవనంలో ఈవో ఛాంబర్ లో టిటిడి, మున్సిపల్ అధికారులతో కలిసి ఈవో శ్రీనివాస సేతు నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, మీడియన్స్, మొక్కల పెంపకం, డ్రైనేజి, వీధుల ఆధునీకరణ, అవసమయిన చోట్ల పెయింటింగ్, లైటింగ్ తదితర పనులను ఈ నెల 30వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. రామానుజ సర్కిల్ నుండి సుబ్బలక్ష్మి సర్కిల్ వరకు పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు ఇతర ప్రాంతాలలో తయారీలో ఉన్న బేరింగ్ లు, వాషర్లను వేగవంతంగా తెప్పించాలన్నారు. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుండి రామానుజ సర్కిల్ వరకు, శ్రీనివాసం నుండి కపిల తీర్థం, మంగళం రోడ్డు వరకు పూర్తయిన రోడ్లను మున్సిపల్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు వివరించారు.
టీటీడీ ట్రస్టులకు రూ.7.64 లక్షలు విరాళం
రష్యాకు చెందిన అచ్యుత మాధవ దాసు అనే భక్తుడు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ట్రస్టులకు గురువారం రూ.7 లక్షల 64 వేలు విరాళంగా అందించారు. దాత తరపున ఆయన స్నేహితుడు శ్రీ కృష్ణ కన్నయ్య దాస్ టీటీడీ పరిపాలన భవనంలో ఈవోకు విరాళం డీడీలను అందజేశారు.
ఇందులో ఎస్వీబీసీ ట్రస్ట్ కు రూ 1 లక్ష 64 వేలు, ఎస్వీ అన్నప్రసాదం, గోసంరక్షణ, ప్రాణదాన, విద్యా దాన, వేద పారాయణ ట్రస్టు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంలకు రూ.లక్ష చొప్పున విరాళం అందించారు.