TTD Updates: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి 24గంటల సమయం
30 May 2023, 8:56 IST
- TTD Updates: తిరుమలలో సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. భక్తులు స్వామి వారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఎస్‌ఎస్‌డి టోకెన్లు లేని వారికి క్యూ లైన్లలో గరిష్టంగా 30గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది.
తిరుమల
TTD Updates: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. భక్తుల కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి టి.బి.సి వరకు క్యూలైన్‍లో స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారిని 78,126 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,597 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు లభించింది.
జూన్‌లో విశేష ఉత్సవాలు…
తిరుమలలో జూన్ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. జూన్ 2న నమ్మాళ్వార్ శాత్తుమొర ఉత్సవంతో పాటు జూన్ 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ శ్రీవారి ఆలయంలో జ్వేష్టాభిషేకం నిర్వహించనున్నారు.
జూన్4వ తేదీన ఏరువాక పూర్ణిమను నిర్వహించనున్నారు. జూన్ 14వ తేదీన మతత్రయ ఏకాదశి, జూన్ 28వ తేదీన పెరియాళ్వార్ ఉత్సవారంభం ఉంది. జూన్ 29వ తేదీన శయన ఏకాదశి కావడంతో చాతుర్మాస్య వ్రతారంభం నిర్వహించనున్నారు.
ఘాట్ రోడ్డులో ప్రమాదం….
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్డులో ఆరవ మలుపు వద్ద టెంపో వాహనం బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. టెంపోలో కర్ణాటకలోని కోలార్ ప్రాంతానికి చెందిన భక్తులకు ప్రయాణిస్తున్నట్లు అధికారుల తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడపడం వల్లే ఈప్రమాదం జరిగినట్లు భక్తులు వివరించారు. డ్రైవర్ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు.
ప్రమాదంలో ఘటనలో గాయపడిన భక్తులను సమీపంలోని రుయా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో రుయా నుంచి బర్డ్ ఆస్పత్రికి తరలించారు. భక్తులకు మరింత మెరుగైన వైద్యం అందేలా ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల ఘాట్ రోడ్డులో వరుసగా ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం బాధకరమని, సత్వరమే దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అధికారులకు ఈఓ ఆదేశాలు జారీ చేశారు. వాహనాల వేగ నియంత్రణకు సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.