తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Finance Commission Grants : ఏపీకి 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థ‌ల‌ నిధులు విడుద‌ల

Finance Commission Grants : ఏపీకి 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థ‌ల‌ నిధులు విడుద‌ల

HT Telugu Desk HT Telugu

13 October 2024, 6:30 IST

google News
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థ‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం 15 ఆర్థిక సంఘం నిధుల‌ను విడుద‌ల చేసింది. రూ.988 కోట్లకుపైగా మొదటి విడతగా విడుదలైంది. ఈ మేర‌కు శ‌నివారం కేంద్ర పంచాయ‌తీ రాజ్ మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది.
ఏపీకి 15వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థ‌ల‌ నిధులు విడుద‌ల
ఏపీకి 15వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థ‌ల‌ నిధులు విడుద‌ల

ఏపీకి 15వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థ‌ల‌ నిధులు విడుద‌ల

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు (ఆర్ఎల్‌బీ) 2024-25 ఆర్థిక సంవత్సరానికి 15వ‌ ఆర్థిక సంఘం గ్రాంట్‌ల మొదటి విడతను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు అన్‌టైడ్ గ్రాంట్లు మొత్తం రూ.395.5091 కోట్లు, టైడ్ గ్రాంట్‌లు మొత్తం రూ.593.2639 కోట్లు విడుద‌ల చేసింది. ఈ నిధులు ఆంధ్రప్రదేశ్‌లో సక్రమంగా ఎన్నికైన తొమ్మిది అర్హతగల జిల్లా పంచాయతీలు, 615 అర్హతగల బ్లాక్ పంచాయతీలు, 12,853 అర్హతగల గ్రామ పంచాయతీలకు సంబంధించినవని కేంద్ర పంచాయ‌తీ రాజ్ మంత్రిత్వ శాఖ‌ పేర్కొంది.

అన్‌టైడ్ గ్రాంట్లు వ్యవసాయం, గ్రామీణ గృహాల నుండి విద్య, పారిశుధ్యం వరకు రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లోని 29 విషయాలలో నిర్దిష్ట స్థానిక అవసరాలను పరిష్కరించేందుకు పంచాయతీలను అనుమతిస్తుంద‌ని తెలిపింది. ఈ నిధులు జీతాలు లేదా ఇత‌ర ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఖర్చుల కోసం ఉపయోగించ‌కూడ‌ద‌ని పేర్కొంది. టైడ్ గ్రాంట్లు పారిశుధ్యం, బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్‌) స్థితి నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, నీటి రీసైక్లింగ్, గృహ వ్యర్థాల శుద్ధితో సహా నీటి నిర్వహణ వంటి ప్రధాన అంశాల‌పై ఖ‌ర్చు చేయాల‌ని పేర్కొంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జీ ప్రకారం… ఈ నిధులు అవసరమైన సేవలు, మౌలిక సదుపాయాలను నిర్వహించడానికి పంచాయతీలకు అధికారం కల్పిస్తాయ‌ని వివరించింది. అనుబంధ గ్రాంట్ల సదుపాయం గ్రామ పంచాయతీలకు స్థానిక స్వపరిపాలనను పునర్నిర్వచించటానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందించింద‌ని తెలిపింది. ఇది మహాత్మా గాంధీ 'గ్రామ స్వరాజ్యం' దార్శనికతకు అనుగుణంగా, అట్టడుగు స్థాయిలో బాధ్యతాయుతమైన, ప్రతిస్పందించే నాయకత్వ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంద‌ని పేర్కొంది.

ఈ సాధికారత ప్రక్రియ "విక్షిత్ భారత్" లక్ష్యాన్ని సాధించే దిశగా దృఢ నిబద్ధతను నొక్కిచెబుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్న 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' అనే ప్రభుత్వ మార్గదర్శక సూత్రంతో ప్రతిధ్వనిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. స్థానిక పాలనను మెరుగుపరచడం ద్వారా ఈ నిధులు సమ్మిళిత వృద్ధికి, స్థిరమైన గ్రామీణ అభివృద్ధికి దోహదం చేస్తాయ‌ని పేర్కొంది. భాగస్వామ్య ప్రజాస్వామ్యం, గ్రామ-స్థాయి పురోగతికి భారతదేశ నిబద్ధతను బలోపేతం చేస్తాయ‌ని స్ప‌ష్టం చేసింది.

పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ (తాగునీరు అండ్‌ పారిశుద్ధ్య విభాగం) ద్వారా గ్రామీణ స్థానిక సంస్థల కోసం రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. వీటిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది. కేటాయించిన గ్రాంట్లు ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు వాయిదాలలో సిఫార్సు చేయ‌బ‌డ‌తాయి. ఆ త‌రువాత విడుదల అవుతాయి.

ఈ గ్రామీణ స్థానిక సంస్థ‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల‌ను ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాజస్థాన్ కూడా విడుదల చేసింది. రాజస్థాన్‌కు మొత్తం రూ.1,267 కోట్లను విడుద‌ల చేసింది. ఆ రాష్ట్రంలోఎన్నికైన 22 అర్హత గల జిల్లా పంచాయతీలు, 287 అర్హత గల బ్లాక్ పంచాయతీలు, 9,068 అర్హత గల గ్రామ పంచాయతీలకు రూ.507.1177 కోట్ల అన్‌టైడ్ గ్రాంట్లు, రూ. 760.6769 కోట్ల టైడ్ గ్రాంట్లు విడుదల చేసింది.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం