BJP Strategy: మొన్న ఎన్టీఆర్, తాజాగా నితిన్.. అంతుచిక్కని బీజేపీ అంతరంగం!-what is bjp plan behind tollywood heroes meetings full details here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Strategy: మొన్న ఎన్టీఆర్, తాజాగా నితిన్.. అంతుచిక్కని బీజేపీ అంతరంగం!

BJP Strategy: మొన్న ఎన్టీఆర్, తాజాగా నితిన్.. అంతుచిక్కని బీజేపీ అంతరంగం!

Mahendra Maheshwaram HT Telugu
Aug 28, 2022 10:16 AM IST

BJP - Tollywood Heroes: మొన్న ఎన్టీఆర్... తాజాగా నితిన్.. ఇలా సినీ హీరోలతో బీజేపీ అగ్రనేతలు టచ్ లోకి రావటం... తెలుగు రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. అసలు బీజేపీ వ్యూహం ఏంటన్న అనే చర్చ అందరిలోనూ మొదలైంది.

<p>టాలివుడ్ హీరోలతో బీజేపీ నేతల భేటీ</p>
టాలివుడ్ హీరోలతో బీజేపీ నేతల భేటీ (HT)

bjp leaders meeting with tollywood heroes: జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ... తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. సమావేశంలో ఏం చర్చించారు..? రాజకీయ అంశాలపైనేనా..? లేక ఆర్ఆర్ఆర్ సినిమా గురించేనా అన్న చర్చ ఓ రేంజ్ లోనే నడించింది. అసలు అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్‌తో ఎందుకు సమావేశమయ్యారనే విషయం ఎవరికీ తెలియకపోయినా.. దీనిపై ఎవరికి వారు విశ్లేషణలు, ఊహాగానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగానే... మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు హీరో నితిన్ తో భేటీ అయ్యారు. అయితే ఉన్నట్టుండి బీజేపీ పెద్దలు ఈ రకంగా సినీ స్టార్స్‌ను ఎందుకు కలుస్త్తున్నారనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.

bjp focus on tollywood heros: ఇక తాజాగా తెలంగాణకు చెందిన టాలీవుడ్‌ హీరో నితిన్ తో జేపీ నడ్డా భేటీ కావటం కూడా ప్రాధాన్యత ఏర్పడింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నితిన్... సినిమా రంగంలో నిలదొక్కుకున్నారు. అందుకే నితిన్‌ని ఎంచుకున్నట్టు అనే కూడా చర్చ సాగుతోంది. అయితే ఏ మాత్రం రాజకీయాలతో సంబంధంలేని నితిన్ తో భేటీ కావాల్సిన అవసరం ఏం వచ్చిందన్న ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. అయితే వీరిద్దరి భీటికి సంబంధించి ఆ పార్టీ ఎంపీ కె లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ దేశానికి సరైన నాయకత్వం అందిస్తున్నట్టు నితిన్ చెప్పారని... తమ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని వెల్లడించారు. ప్రధాని మోదీని స్వయంగా కలవాలని నితిన్ కోరారని చెప్పుకొచ్చారు. క్రికెట్ మిథాలీ రాజ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరు త్వరలోనే ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే ‘మిషన్ తెలంగాణ’ పేరుతో ప్రత్యేక వ్యూహాలతో ముందుకుసాగుతున్న బీజేపీ నాయకత్వం... ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ లను కలవటం ద్వారా... చాలా మంది బీజేపీ వైపు చూస్తున్నారనే విషయం చెప్పటంతో పాటు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఉపయోగపడుతాయని ఆ పార్టీ పెద్దలు భావించి ఉండొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. తమతో సమావేశానికి వచ్చే సినీ హీరోల మద్దతు కూడా తమకే ఉంటుందని చెప్పుకోవడానికి వీలు ఉంటుంది కాబట్టి.. ఈ రకమైన సమావేశాల కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లోని మరికొందరు నటీనటులను కూడా బీజేపీ నేతలను కలిసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..

ఇక కాంగ్రెస్ అధికారంలోకి ఉన్న సమయంలో చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తతం ఇప్పటికే కొంత మంది బీజేపీలో కూడా చేరారు. ఇప్పటికే విజయశాంతి ఆ పార్టీలో కొనసాగుతుండగా... తాజాగా జీవిత రాజశేఖర్ కూడా కాషాయం గూటికి చేరారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉంటున్నారు. ఈ మధ్యే ప్రముఖ రచయిత, ఎస్‌ఎస్‌ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ను రాజ్యసభకు పంపింది బీజేపీ నాయకత్వం. ఈ నిర్ణయం అందరిలోనూ ఆసక్తిని రేపిన సంగతి తెలిసింది.

ఇలా విజయేంద్ర ప్రసాద్ కు రాజ్యసభ సీటు ఇచ్చి సరికొత్త రాజకీయానికి తెరలేపిన బీజేపీ... జూనియర్ ఎన్టీఆర్, నితిన్, మిథాలీ రాజ్ వంటి వారితో అగ్రనేతల భేటీల వరకు తీసుకువచ్చింది. అయితే ఈ భేటీల వెనక ఉన్న అసలైన రాజకీయ వ్యూహం ఏమిటి ? అగ్రనేతలే ఎందుకు సీన్ లోకి వస్తున్నారు..? దక్షిణ భారతంపై పట్టు సాధించటం కోసమా.. లేక తెలంగాణలో అధికార ఏర్పాటు లక్ష్యంగానే ఈ తరహా పావులు కదుపుతుందా అనేది మాత్రం ప్రస్తుతానికి అంతుచిక్కటం లేదు.

Whats_app_banner