Warangal Rains: వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం
Warangal Rains: మొన్నటిదాకా హైదరాబాద్‌పై ప్రతాపం చూపిన వర్షాలు.. ఇప్పుడు వరంగల్ జిల్లాపై పంజా విసురుతున్నాయి. శుక్రవారం సాయంత్రం వరంగల్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం సాయంత్రం వరకు సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోంది. 4: 25 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. వరంగల్, హన్మకొండ, ఖాజీపేట, గీసుగొండ, నర్సంపేట, పరకాల ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పాఠశాలలు వదిలే సమయం కావడంతో ఇబ్బందులకు గురయ్యారు.
వరంగల్ నగరం, నర్సంపేట పట్టణంలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మరోవైపు ప్రధాన జలాశయాలు నిండు కుండలా మారి మత్తడి పోస్తున్నాయి. ఖానాపురం మండలంలోని పాఖాల చెరువు మత్తడి పోస్తోంది. నర్సంపేట మండలం మాధన్నపేట చెరువు పూర్తిగా నిండి అలుగు పోస్తోంది. దీంతో నీటి పారుదల శాఖ అధికారులు అలెర్ట్ అయ్యారు. చెరువులను నిత్యం పరిశీలిస్తున్నారు. ఎన్ని ఫీట్ల మత్తడి పోస్తోంది.. తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు వివరిస్తున్నారు.
మరో 2 రోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, కుమ్రంభీం పెద్దపల్లి, జగిత్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.