Village Sarpanch : ఎలక్షన్ రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం- మూడు గుళ్లు, ఇంటికో వెయ్యి, రూ.50 లక్షల జరిమానా కండీషన్లు-warangal cheruvu komma tanda people elected sarpanch with three temple condition ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Village Sarpanch : ఎలక్షన్ రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం- మూడు గుళ్లు, ఇంటికో వెయ్యి, రూ.50 లక్షల జరిమానా కండీషన్లు

Village Sarpanch : ఎలక్షన్ రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం- మూడు గుళ్లు, ఇంటికో వెయ్యి, రూ.50 లక్షల జరిమానా కండీషన్లు

HT Telugu Desk HT Telugu
Sep 10, 2024 09:28 PM IST

Village Sarpanch : పంచాయతీ ఎన్నికల జరక్కుండానే ఆ గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక పూర్తైంది. సర్పంచ్ గా ఎన్నుకున్న అభ్యర్థి గ్రామంలో మూడు గుళ్లు కట్టిస్తానని, ఇంటింటికీ రూ.1000 చొప్పున ఇస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా పోటీ చేస్తే రూ.50 లక్షల జరిమానా విధించాలని అంగీకార పత్రం రాసుకున్నారు.

ఎలక్షన్ రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం- మూడు గుళ్లు, ఇంటింటికీ వెయ్యి, రూ.50 లక్షల జరిమానా కండీషన్లు
ఎలక్షన్ రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం- మూడు గుళ్లు, ఇంటింటికీ వెయ్యి, రూ.50 లక్షల జరిమానా కండీషన్లు

Village Sarpanch : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ కూయకముందే ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నిక పూర్తయ్యింది. గ్రామస్తులంతా ఏకమై సర్పంచ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామానికి సంబంధించిన అవసరాలు తీర్చడంతో పాటు గ్రామంలో మూడు గుళ్లు కట్టించి, ఆ గుడిలో నిర్వహించే పండుగనాడు ప్రతి ఇంటికి ఖర్చుల నిమిత్తం వెయ్యి చొప్పున ఇవ్వాలని తీర్మానం చేసుకున్ని సర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో సర్పంచ్ గా ఎన్నికైన వ్యక్తి గ్రామంలో ఏకంగా విజయోత్సవ సంబరాలు కూడా నిర్వహించారు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో చోటు చేసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చెరువుకొమ్ము తండా చర్చనీయాంశంగా మారింది.

మూడు గుళ్లు.. ఇంటికో వెయ్యి

వరంగల్ జిల్లా చెరువుకొమ్ము తండాలో సుమారు 883 మంది వరకు జనాభా ఉండగా.. 700 మంది వరకు ఓటర్లు ఉన్నారు. కాగా గత పాలకవర్గం హయాంలో నిధుల లేమీ కారణంగా గ్రామంలో పెద్దగా అభివృద్ధి పనులు చేపట్టలేదు. దీంతో గ్రామంలో చాలావరకు సమస్యలు పేరుకుపోగా.. జనాలు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అంతేగాకుండా గ్రామ దేవతలైన బొడ్రాయి, కనకదుర్గమ్మ గుడి పండుగలు చేయకపోవడం, ఊరిలో హనుమంతుడి విగ్రహం లేకపోవడం వల్ల గ్రామంలో అరిష్టాలు జరుగుతున్నాయని అక్కడి ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. దీంతో ఇటీవల గ్రామస్థులంతా సమావేశమయ్యారు. సమస్యలన్నింటిపై చర్చించారు.

ఈ క్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గా పని చేసిన ధరావత్ బాలాజీ అనే వ్యక్తి గ్రామస్థులంతా ఒప్పుకుంటే తానే సర్పంచ్ గా నిలబడతానని అక్కడి ప్రజలకు చెప్పాడు. తనను ఏకగ్రీవంగా సర్పంచ్ చేస్తే గ్రామ సమస్యలు పరిష్కరించడంతో పాటు సొంత పైసలతో ఊరిలో బొడ్రాయి, పోచమ్మ తల్లి, ఆంజనేయుడికి గుళ్లు కట్టిస్తానని, విగ్రహాలు పెట్టిస్తానని మాటిచ్చాడు. బొడ్రాయి పండుగ ఖర్చు కోసం గడప గడపకు రూ.1000 చొప్పున పంచుతానని హామీ ఇచ్చాడు. తనను ఏకగ్రీవం చేస్తే తాను ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తానని చెప్పాడు.

మాట తప్పితే ఎలా?

వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకుండా, తనను ఏకగ్రీవం చేయాలని ధరావత్ బాలాజీ కండీషన్ పెట్టగా.. అందుకు గ్రామస్థులంతా ఒప్పుకున్నారు. ఇదిలాఉంటే సర్పంచ్ గా ఏకగ్రీవం చేశాక మాట తప్పితే ఎలా అని కొందరు గ్రామస్థులు బాలాజీని ప్రశ్నించారు. దీంతో ఎన్నికలు రాకముందే తాను చెప్పిన పనులన్నీ ప్రారంభించి, పూర్తి చేస్తానని ధరావత్ బాలాజీ హామీ ఇచ్చారు.ఈ మేరకు సోమవారం ఊళ్లో వాళ్లంతా గ్రామంలో మీటింగ్ పెట్టుకుని అగ్రిమెంట్ పేపర్ రాసుకున్నారు. సర్పంచ్ అభ్యర్థి ధరావత్ బాలాజీతో పాటు గ్రామస్తులు అగ్రిమెంట్ పేపర్ లో సంతకాలు చేశారు.

ఎవరైనా పోటీ చేస్తే రూ.50 లక్షల జరిమానా

గ్రామస్థులు కోరిన మేరకు మూడు గుళ్లు, పండుగల నాడు ఇంటికి రూ.వెయ్యి చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న ధరావత్ బాలాజీ గ్రామస్థులకు ఒక షరతు పెట్టాడు. పంచాయతీ ఎలక్షన్స్ సమయంలో కేవలం బాలాజీ ఇంటి నుంచి మాత్రమే నామినేషన్ వేయాలని, దీనిని అతిక్రమించి ఎవరైనా నామినేషన్ వేస్తే వారికి రూ.50 లక్షల వరకు జరిమానా విధించేలా అగ్రిమెంట్లో రాయించాడు. ఒప్పంద పత్రంపై ఇరుపక్షాలవారు సంతకాలు చేయగానే సర్పంచ్ అభ్యర్థితో పాటు గ్రామస్తులంతా రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకున్నారు. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కాగా.. మంగళవారం ఉదయం స్థానిక రెవెన్యూ అధికారులు గ్రామంలో వివరాలు సేకరించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తమని స్పష్టం చేశారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

సంబంధిత కథనం