OU PG College Secunderabad: సికింద్రాబాద్‌లోని ఓయూ పీజీ కాలేజీ క్యాంపస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఇద్దరు ఆగంతకులు లేడీస్ హాస్టల్ బాత్ రూమ్ లోకి చొరబడ్డారు. వీరిని గమనించిన విద్యార్థినులు…. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వీరిలో ఒకరు పట్టుబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని…. వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనలో ఒక్కసారిగా క్యాంపస్ లోని విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. తమ రక్షణకు చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. కళాశాల గేట్లు మూసివేసి నిరసనలు చేస్తున్నారు. వీసీ రావాలంటూ నినాదాలు చేపట్టారు.
విద్యార్థినులు చెబుతున్న వివరాల ప్రకారం… గత రెండు మూడు రోజులు వ్యక్తులు సంచారిస్తున్నారు. రాళ్ల విసరటంతో పాటు సైగలు చేయటం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి తర్వాత బాత్ రూమ్ కిటీకీల ద్వారా లోపలికి వచ్చారు. సెక్యూరిటీరికి సమాచారం ఇవ్వగా… వారు వచ్చి వెతికారు. కానీ ఎవరూ కనిపించలేదు. కాసేపటికి ఆగంతకులు కంటపడ్డారు. అప్రమత్తమైన విద్యార్థినులు… వారి వెంటపడి పట్టుకున్నారు. ఒకరు తప్పించుకోగా…. ఒకరు దొరికిపోయాడు.
ప్రస్తుతం క్యాంపస్ ప్రధాన గేటు వద్ద ఇద్దరు సెక్యూరిటీ ఉన్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. లేడీస్ హాస్టల్ క్యాంపస్ వద్ద ఒకే ఒక్క మహిళా సెక్యూరిటీ ఉందని అంటున్నారు. ఈ ఘటనపై వీసీ స్పందించి… తమ రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్శిటీ కాలేజీల్లో ఈలాంటి ఘటనలు జరగటం సిగ్గుచేటని వాపోయారు.
ఈ ఘటనపై నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శని స్పందించారు. అర్ధరాత్రి 1 గంట తర్వాత పోలీసులు ఫోన్ కాల్ ద్వారా సమాచారం వచ్చిందని చెప్పారు. విద్యార్థుల సమస్యలపై ఆరా తీసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. దీనిపై ఎవరి నుంచి ఫిర్యాదు అందలేదన్నారు.