TSSPDCL Recruitment 2023: గుడ్ న్యూస్.. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 1,601 పోస్టుల భర్తీకి ప్రకటన
TSSPDCL Recruitment Latest: పలు ఉద్యోగాల భర్తీకి మరోసారి ప్రకటన విడుదల చేసింది టీఎస్ఎస్పీడీసీఎల్. ఈ మేరకు ప్రకటన ఇచ్చింది.
TSSPDCL Latest Updates:తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. గతేడాది డిసెంబర్ లో భారీగా నోటిఫికేషన్లు వచ్చేశాయి. ఇందులోని పలు ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేయనుండగా... మరిన్నింటిని ఆయా శాఖలు భర్తీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది. పరీక్షలను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చింది టీఎస్ఎస్పీడీసీఎల్. ఖాళీగా ఉన్న మరో 1601 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఓ ప్రకటన జారీ చేసింది.
తాజా ప్రకటనలో భాగంగా మొత్తం 1601 ఉద్యోగాలు ఉండగా ఇందులో... 1,553 జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం), 48 అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రారంభం, ఖాళీల వివరాలను ఫిబ్రవరి 15వ తేదీన పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వెల్లడించనున్నట్లు TSSPDCL ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన ఇచ్చింది. https://tssouthernpower.cgg.gov.in వెబ్ సైట్ సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు.
గతంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ రద్దు అయిన సంగతి తెలిసింజే. ఈ రాత పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు, ఇతరులు డబ్బులు వసూలు చేసి కొంత మంది అభ్యర్థులకు సమాధానాలు చేరవేశారని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఫలితంగా ఈ నోటిఫికేషన్ ను రద్దు చేశారు.