TSRTC Bus Tracking : ఇక బస్‌స్టాప్‌లో గంటలతరబడి నిల్చోవడం చరిత్రే
టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్నారా? లేదంటే నేరుగా వెళ్లి.. బస్ ఎక్కాలి అనుకుంటున్నారా? డోంట్ వర్రీ.. ఇక మీరు పెద్దగా వెయిట్ చేయాల్సిన పనిలేదు. ఎలా అంటారా?
అబ్బా.. ఈ బస్ ఎప్పుడు వస్తుందా? అని బస్ స్టాప్ లో ఎన్నిసార్లు తిట్టుకుని ఉంటారో కదా. ఇక అదంతా చరిత్రే. మీరు ఎక్కాల్సిన బస్సు.. ఎప్పుడు వస్తుంది, ఎక్కడ ఉంది అనేది ఈజీగా తెలిసిపోనుంది. బస్సుల రాకపోకల సమయాన్ని ప్రయాణికులు ఈజీగా గుర్తించడం కోసం టీఎస్ఆర్టీసీ సరికొత్తగా ట్రాకింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. దీనికోసం.. టీఎస్‌ఆర్టీసీ బస్ ట్రాకింగ్’(TSRTC Bus Tracking) పేరిట ఆర్టీసీ అధికారులు ప్రత్యేక యాప్‌ను తయారు చేయించారు. ఈ యాప్‌ని ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. దీని ద్వారా బస్సులు స్టాప్లకు చేరుకునే సమయాన్ని తెలుసుకోవచ్చు.
TSRTC బస్సుల ట్రాకింగ్ కోసం "TSRTC బస్ ట్రాకింగ్" పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో మొబైల్ యాప్‌ను ప్రారంభించినట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. 140 బస్సుల్లో పైలట్ ప్రాజెక్టులో భాగంగా కంటోన్‌మెంట్, మియాపూర్-2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్పక్ బస్సులను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్‌కు వివిధ రూట్లలో, 100 సుదూర బస్సులను మియాపూర్-1, పికెట్‌కు నడుపుతున్నట్లు సజ్జనార్ తెలిపారు. శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, బెంగళూరు, విశాఖపట్నం వంటి రూట్లలో నడుస్తున్న డిపోలను ప్రస్తుతం ట్రాక్ చేయనున్నారు.
రెండు నెలల్లో హైదరాబాద్ తోపాటుగా.. జిల్లాల్లోని అన్ని రిజర్వేషన్ సర్వీసులు, ప్రత్యేక సర్వీసులకు బస్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రవేశపెడతారు. TSRTC బస్ ట్రాకింగ్ యాప్‌ను TSRTC అధికారిక వెబ్‌సైట్ www.tsrtc.telangana.gov .inలో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణలోని 96 డిపోల పరిధిలోని ఎంపిక చేసిన 4,170 బస్సులను ఈ యాప్‌తో దశలవారీగా అనుసంధానించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ సదుపాయాన్ని ప్రయోగాత్మకంగా 140 బస్సుల్లో ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనా చెప్పారు. హైదరాబాద్‌లో పుష్పక్, మెట్రో లగ్జరీ, డీలక్స్, మెట్రో ఎక్స్ ప్రెస్ల వివరాలు యాప్ లో ఉంటాయి.
శంషాబాద్ విమానాశ్రయానికి నడిచే బస్సులు, మరో వంద బస్సులను కూడా ట్రాకింగ్ ఇచ్చారు. శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, విశాఖపట్నం మార్గాలకు వెళ్లే బస్సుల సమాచారాన్ని యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సులు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నా ఆ సమాచారం తెలిసిపోతుంది.