TRS Counter : బీజేపీ ఆరోపణలకు టీఆర్‌ఎస్‌ స్ట్రాంగ్ కౌంటర్-trs counter attacks on bjp for delhi liquor scam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Trs Counter : బీజేపీ ఆరోపణలకు టీఆర్‌ఎస్‌ స్ట్రాంగ్ కౌంటర్

TRS Counter : బీజేపీ ఆరోపణలకు టీఆర్‌ఎస్‌ స్ట్రాంగ్ కౌంటర్

HT Telugu Desk HT Telugu
Aug 23, 2022 12:09 PM IST

తమ మాట వినని రాష్ట్రాలు, ముఖ్యమంత్రులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సిబిఐలను ప్రయోగించి బెదిరింపులకు పాల్పడుతోందని టిఆర్ఎస్‌ ఆరోపిస్తోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంపై బీజేపీ ఆందోళన నేపథ్యంలో ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అహంకారంతో వ్యవహరించిన కాంగ్రెస్‌ పరిస్థితే బీజేపీకి తప్పదని హెచ్చరిస్తున్నారు.

<p>బీజేపీపై టిఆర్‌ఎస్‌ ఆగ్రహం</p>
బీజేపీపై టిఆర్‌ఎస్‌ ఆగ్రహం

జమ్మూ కశ్మీర్‌ నుంచి తమిళనాడు వరకు ఎక్కడైనా ఈడీ, సిబిఐ దాడులు జరిగితే వాళ్లు మోదీ శత్రువులు అయినా అవ్వాలని, లేకుంటే ఆ పార్టీలో చేర్చుకునేందుకు జరిగే ప్రయత్నాలైనా కావొచ్చని టిఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరును తెరపైకి తీసుకురావడంతో టిఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మద్యం టెండర్ల వ్యవహారంలో తనకేమి సంబంధం లేదని కవిత ఇప్పటికే స్పష్టం చేశారు.

తెలంగాణ బతుకమ్మ జోలికి వస్తే బీజేపిని ఆగమాగం చేస్తామని ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. కవిత ఇంటిపై బీజేపీ నాయకులే దాడి చేసి వాళ్లే మళ్లీ దాడి చేసిన వారిని వదిలేయాలంటూే ఆందోళనకు దిగుతున్నారని టిఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. బీజేపీ వ్యవహారాన్ని తెలంగాణ ప్రజానీకం మొత్తం వ్యతిరేకిస్తున్నారని ఆ పార్టీకి బుద్ది చెప్పే రోజులు దగ్గరకొచ్చాయంటున్నారు. మరోవైపు కవిత ఇంటి ముందు ఆందోళన చేసిన వారిలో చాలామంది చీటింగ్ కేసులు ఎదుర్కొన్న వారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

2004-2014 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు 112 మాత్రమే జరిగాయని, 2014 నుంచి 22 వరకు మూడు వేల కు ఈడీ దాడులు జరిగాయని టిఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ఈడీ మోదీ జేబులో కీలు బొమ్మగా మారిందని, ప్రధాని మోదీ కార్పొరేట్ల చేతిలో కీలు బొమ్మ అయితే ఈడీ మాత్రం మోదీ చేతిలో బొమ్మ అయ్యిందని టిఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని బెదిరించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని వాడుతున్నారని టిఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. సిఎం కేసీఆర్ పోరాట యోధుడని, బీజేపీపై పోరాటాన్ని తట్టుకోలేక కుట్రలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈడీకి దమ్ముంటే తమపై రైడ్స్‌ నిర్వహించాలని సవాలు చేస్తున్నారు. ఈడీ, ఐటీల దర్యాప్తును కవిత స్వాగతిస్తుంటే ఏదో జరిగిపోతోందని ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ ఇదే మాదిరి వ్యవహారించి అధికార దుర్వినియోగంతో చివరకు అధికారాన్ని కోల్పోయిందని తెలంగాణ ఆర్టీసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.

Whats_app_banner