Sangareddy Suicide: సంగారెడ్డి లో విషాదం, భర్తతో విడాకులు,మనస్తాపంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య-tragedy in sangareddy divorce with husband grief stricken software employee commits suicide ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy Suicide: సంగారెడ్డి లో విషాదం, భర్తతో విడాకులు,మనస్తాపంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

Sangareddy Suicide: సంగారెడ్డి లో విషాదం, భర్తతో విడాకులు,మనస్తాపంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu
Jul 09, 2024 07:03 AM IST

Sangareddy Suicide: సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భర్తతో విడాకుల కారణంగా మనస్థాపానికి గురైన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఒకేసారి 130 నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది.

సంగారెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య
సంగారెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

Sangareddy Suicide: భర్తతో విడాకులు తీసుకోవడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డిలో జిల్లాలో జరిగింది. జిల్లాలోని అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పీజేఆర్ కాలనీ మాధవపూరి హిల్స్ లో పంతటి రీనా (30 ) కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తుంది. ఆమె మూడున్నరేళ్ల క్రితం మేడిపల్లి సాయి అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. కాగా కొంతకాలం వరకు వీరి సంసారం సాఫీగా సాగింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

నిద్ర మాత్రలు మింగి .…

అప్పటి నుండి రీనా తల్లితండ్రుల వద్ద ఉంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం వర్క్ ఫ్రమ్ హోం చేస్తుంది. దీంతో ఎప్పుడు విడాకుల సంఘటనను తలచుకుంటూ బాధపడేది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత తన గదిలోకి వెళ్లి 130 నిద్ర మాత్రలు మింగి పడుకుంది. కాగా సోమవారం ఉదయం లేవకపోవడంతో తల్లి సక్కుబాయి డోర్ కొట్టి పిలవగా పలకలేదు.

దీంతో తల్లి భయంతో భర్త శ్రీనివాస్, కుమారుడు సతీష్ కి విషయం చెప్పింది. వెంటనే వారు తలుపులు పగలగొట్టి లోపలి వెళ్లి చూడగా రీనా బెడ్ పై స్పృహ లేకుండా పడి ఉంది. దీంతో తల్లితండ్రులు నిద్ర మాత్రలు మింగినట్లు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తమ కూతురు తరచూ విడాకుల విషయం తలచుకొని బాధపడుతూ ఉండేదని తల్లి తెలిపారు.

ఈ క్రమంలో మనస్థాపానికి గురై జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందని తండ్రి శ్రీనివాస్ పోలీసులకు పిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరో ఘటనలో తండ్రి ఆత్మహత్య.....

రెండు నెలల క్రితం వివాహం జరిగిన కూతురి సంసారంలో గొడవలు తలెత్తడంతో మనస్థాపానికి గురై తండ్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా ధర్మారం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధర్మారం గ్రామానికి చెందిన కనకయ్య (58),భార్య సత్తవ్వ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

వీరికి ఒక కుమారుడు రాజు,కూతురు దీపిక ఉన్నారు. కాగా రెండు నెలల క్రితం కుమార్తె దీపికకు వివాహం చేశారు. ఈ క్రమంలో కూతురు భర్తతో విబేధాల కారణంగా పుటింట్లోనే ఉంటుంది. దీనికి తోడు ఆర్ధిక ఇబ్బందులు,కుటుంబ కలహాలతో కనకయ్య సతమతం అవుతున్నాడు. దీంతో శనివారం రాత్రి ఇంటి నుండి వెళ్ళిపోయి తిరిగి మరల ఇంటికి రాలేదు.

దీంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం స్థానిక ఎస్సీ హాస్టల్ సమీపంలోని గొర్ల కొట్టంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు రాజు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

WhatsApp channel