Wife And Husband: పెద్దపల్లిలో విషాదం, అనారోగ్యంతో భార్య సూసైడ్..తట్టుకోలేక భర్త బలవన్మరణం
Wife And Husband: పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. అన్యోన్యంగా ఉండే దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్యంతో భార్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా భార్య మృతిని తట్టుకోలేక భర్త ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. నిముషాల వ్యవధిలో దంపతులు ఇద్దరు ఆత్మహత్యకు చేసుకున్నారు.
Wife And Husband: పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారంలో నివాసం ఉండే బొడిగే సుజాత , శంకర్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న తీరు కలిసి వేసింది. గత కొంత కాలంగా సుజాత ఎముకలు అరిగిపోయి ఒంటి నొప్పులతో అనారోగ్యం పాలై బాధపడుతుంది.
గీత కార్మిక వృత్తితో శంకర్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భర్తకు భారంగా మారకూడదని భావించిన భార్య సుజాత భర్త పనిపై బయటకు వెళ్ళగా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికొచ్చిన భర్త, ఉరితాడుకు వేళ్ళాడుతున్న భార్యను చూసి తట్టుకోలేక మనస్థాపం చెంది ఇంటి పైకప్పుకున్న ఇనుప పైపుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మూడుముళ్ల బంధంతో ఏడు అడుగులు నడిచి ఆలుమగలుగా మారి ఎల్లకాలం తోడు నీడగా ఉంటానని పెళ్ళి చేసుకున్న దంపతులు చివరకు కలిసి పాడెక్కడం చూపరుల హృదయాలను ద్రవింపజేసింది.
కులవృత్తితో ఇద్దరు బిడ్డలకు పెళ్ళి చేసి…
మంత్రి శ్రీధర్ బాబు స్వగ్రామం కాటారం మండలం ధన్వాడకు చెందిన దంపతులు సుజాత శంకర్ ఏడేళ్ళ క్రితం బతుకుదెరువు కోసం నాగారం వలస వచ్చారు. గీత కార్మికునిగా జీవనం కొనసాగిస్తు ఇద్దరు కూతుళ్ళకు వివాహం చేశారు. ఇక తమకు ఏ ఇబ్బంది లేదని భావిస్తున్న తరుణంలో బోన్స్ అరిగి సుజాత మంచం పట్టింది. ఆరోగ్యంతో బాధపడుతూ భర్తకు భారంగా మారకూడదని ఉరి వేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య లేని లోటును తట్టుకోలేకనే భర్త శంకర్ ఊరి వేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో విషాదం అలుముకుంది.
మంత్రి శ్రీధర్ బాబు దిగ్బ్రాంతి..
అన్యోన్యంగా ఉండే దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో మంత్రి శ్రీధర్ బాబు విచారం వ్యక్తం చేశారు. స్వగ్రామానికి చెందినవారు కావడంతో ఆత్మహత్యకు గల కారణాల గురించి ఆరా తీశారు. కుటుంబానికి అండగా ఉంటానని స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)