MLAs Disqualification : ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం.. 6 ముఖ్యమైన అంశాలు ఇవే!-these are the important points in the case of disqualification of mlas ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlas Disqualification : ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం.. 6 ముఖ్యమైన అంశాలు ఇవే!

MLAs Disqualification : ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం.. 6 ముఖ్యమైన అంశాలు ఇవే!

Basani Shiva Kumar HT Telugu
Sep 09, 2024 04:46 PM IST

MLAs Disqualification : ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశానికి సంబంధించి తాజాగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్‌కు సంబంధించి ప్రధాన అంశాలు ఈ కథనంలో..

కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్
కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ (@TheNaveena)

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించి.. ఆ తర్వాత కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే.. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇష్యూ కాస్త హైకోర్టు వరకు వెళ్లింది. తాజాగా సోమవారం నాడు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారంపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు.

1.ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అనర్హత పిటిషన్లు స్పీకర్‌ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని స్పష్టం చేసింది. పిటిషన్ల విచారణపై షెడ్యూల్‌ రిలీజ్‌ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

2.హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దానం, కడియం, తెల్లం పదవులు ఊడటం ఖాయం అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉపఎన్నిక తప్పదన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో.. రాహుల్ వైఖరి చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు శిక్ష తప్పదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

3.హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హైకోర్టు తీర్పుపై పూర్తి అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులపై కామెంట్ చేసే నైతిక అర్హత బీఆర్‌ఎస్‌కు లేదన్న కడియం.. సింగిల్ బెంచ్ తీర్పుపై డబుల్ బెంచ్‌కు వెళ్ళొచ్చు.. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లొచ్చని వ్యాఖ్యానించారు.

4.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ప్రశ్నిస్తు గైడ్ లైన్స్ ఇచ్చిందని.. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వివరించారు. హైకోర్టు గైడ్ లైన్స్‌ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. హైకోర్టు పరిధిలోనే స్పీకర్ నిర్ణయాలు, కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తీసుకున్న అనైతిక నిర్ణయాలతోనే రాష్ట్రంలో ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు. గతంలో కూడా హైకోర్టు ఈవిధంగా స్పందిస్తే బాగుండేదన్నారు.

5.'ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో రేవంత్ రెడ్డికి ఎలాగూ క్యారెక్టర్ లేదు.. రాహుల్ గాంధీ కనీసం నువ్వైనా క్యారెక్టర్ నిలబెట్టుకో' అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.

6.ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటీష‌న్‌ల‌పై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నాం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్ర‌జాస్వామ్య విధానాల‌కు చెంప పెట్టు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురికావ‌డం త‌థ్యమని జోస్యం చెప్పారు. అన‌ర్హ‌త కార‌ణంగా ఉప ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హైకోర్డు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర శాస‌న‌స‌భాప‌తి నాలుగు వారాల్లో నిర్ణ‌యం తీసుకుని ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌తార‌ని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు.