TSRTC Mahalakshmi Scheme : "మహాలక్ష్మి" ఎఫెక్ట్…. అద్దె బస్సు యాజమానుల గగ్గోలు
TSRTC Mahalakshmi Scheme : మహాలక్ష్మీ స్కీమ్ పై అద్దె బస్సు యాజమానుల గగ్గోలు పెడుతున్నారు. అద్దె బస్సులకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టిసారించాలని కోరారు.
TSRTC Mahalakshmi Scheme : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం అద్దె బస్సుల యజమానుల పాలిట ఆశనిపాతంలా మారింది. ఈ పథకం కింద మహిళలను ఉచితంగా తమ గమ్య స్థానాలకు తీసుకెళ్లాల్సి రావడంతో అద్దె బస్సుల యజమానులు తాము నష్టపోతున్నాము బాబోయ్.. అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈమేరకు ఖమ్మం జిల్లా అద్దె బస్సుల యజమానులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉమ్మడి ఖమ్మం రీజినల్ మేనేజర్ కార్యాలయానికి వచ్చి రీజినల్ మేనేజర్ ను కలిసి తమ మొర వినిపించారు.
ఆర్ ఎం వెంకన్నను కలిసి ఖమ్మం రీజియన్ అద్దె బస్సుల యాజమాన్య సంఘం తరపున వినతి పత్రం అందజేశారు. అనంతరం సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నకరికంటి సత్యంబాబు, ప్రధాన కార్యదర్శి రవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అద్యక్షుడు చండ్ర రామకృష్ణలు విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల అద్దె బస్సులకు నష్టం జరుగుతుందని తెలిపారు. మహాలక్ష్మి పథకం రాక ముందు బస్సులు 50 నుంచి 60 మంది కెపాసిటీలతో నడిచేవని, ఈ పథకం ద్వారా కెపాసిటీకి మించి జనం ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రయాణికుల వింత ప్రవర్తన వల్ల డ్రైవర్, కండక్టర్ లతో గొడవలు కూడా జరుగుతున్నాయని వారు వాపోయారు. డీజిల్ రోజుకి బస్సు ఒక్కింటికి రూ.800 నుంచి రూ.1000 గతంలో కంటే తేడా వస్తుందని తెలిపారు.
ఇన్సూరెన్స్ ప్రయాణికులతో పాటు బస్సులుకు కూడా వచ్చేవిధంగా చర్యలు చేపట్టాలని వారు విన్నవించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అద్దె బస్సులు నడపాలంటే అంతకు ముందు ఉన్న ఖర్చు కంటే మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఖర్చు పెరిగిందని తెలిపారు. కావున ఆర్టీసీ వారు మాకు చెల్లించే అద్దెను కనీసం కిలోమీటర్ కి రెండు రూపాయలు పెంచితేనే తాము బస్సులను నడపగలమని లేనిపక్షంలో అద్దె బస్సులు నడపడం కష్టమని తెగేసి చెప్పారు. తమ డిమాండ్ ను అంగీకరిస్తే ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు. రీజియన్ మేనేజర్ ను కలిసిన వారిలో సంఘం ఖమ్మం జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు, ఖమ్మం జిల్లా 6 డిపోల అద్దె బస్సుల యజమానులు పాల్గొన్నారు.
రిపోర్టింగ్: నరేంద్ర, ఖమ్మం జిల్లా ప్రతినిధి