TGPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు పోస్టర్ల కలకలం-the posters in front of the telangana public service commission office are sensational ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు పోస్టర్ల కలకలం

TGPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు పోస్టర్ల కలకలం

Basani Shiva Kumar HT Telugu
Oct 04, 2024 11:13 AM IST

TGPSC : టీజీపీఎస్సీ తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు కనీసం 150 ప్రశ్నలు తయారు చేయలేకపోతున్నారని.. ఇక కమిషన్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తాజాగా.. ఇదే అంశంపై కమిషన్ కార్యాలయం ఎదుట పోస్టర్లు అంటించారు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట వెలసిన పోస్టర్లు
టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట వెలసిన పోస్టర్లు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు పోస్టర్లు కలకలం సృష్టించాయి. కమిషన్ కార్యాలయం గోడలకు,గేట్లకు పోస్టర్లు వెలిశాయి. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు టీజీపీఎస్సీ తీరుపై నిరుద్యోగులు, పరీక్షలు రాసిన అభ్యర్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'గ్రూప్-1లో 150 ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు. సిగ్గు..సిగ్గు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పులతో నిరుద్యోగులకు ఎన్ని తిప్పలో.. నేను ఒక నియంతని.. తప్పు జరిగితే ఒప్పుకోను.. తెలుగు అకాడమి పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదు.. ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరు కొనవద్దు' అంటూ టీజీపీఎస్సీ, తెలుగు అకాడమీ గేట్లు, గోడలకు పోస్టర్లు వెలిశాయి.

ఇటు గ్రూప్‌ 1 పరీక్షల కీపై అభ్యంతరాలు స్వీకరించామని అధికారులు చెబుతున్నారు. వాటిని సబ్జెక్ట్‌ల వారీగా నిపుణుల కమిటీకి పంపి.. వారు ఆమోదించిన తర్వాత ఫలితాలు విడుదల చేసినట్లు టీజీపీఎస్సీ హైకోర్టుకు తెలిపింది. త్వరలోనే మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయని.. ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదని కమిషన్ కోర్టును కోరింది.

గ్రూప్‌ 1 పోస్టుల భర్తీ కోసం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా.. మరో నోటిఫికేషన్‌ జారీ చేయడం చెల్లదని.. ప్రైమరీ కీలో తప్పులున్నాయని.. వాటిని సవరించాలన్న అభ్యంతరాలను పట్టించుకోకపోవడాన్ని సవాల్‌ చేస్తూ.. అభ్యర్థులు రెండు వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ విచారణ చేపట్టారు.

పరీక్షలు రాసిన 3 లక్షల మంది నుంచి ప్రిలిమ్స్‌ కీపై భౌతికంగా 721, ఆన్‌లైన్‌ ద్వారా 6,470 అభ్యంతరాలు వచ్చాయని.. ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టుకు వివరించారు. వాటిని నిపుణుల కమిటీ పరిశీలించిందని.. ప్రధానంగా ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకుని కమిటీ సిఫారసుల మేరకు రెండు ప్రశ్నలను తొలగించి కీని విడుదల చేసినట్టు న్యాయస్థానానికి వివరించారు.

పిటిషన్‌ దాఖలు చేసిన వారిలో ఒక్కరే కమిషన్‌కు అభ్యంతరాలు తెలియజేశారన్నారని కోర్టుకు వివరించారు. మిగిలినవారు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా కోర్టును ఆశ్రయించారన్నారు. ఈ పిటిషన్‌లను కొట్టివేయాలని న్యాయమూర్తిని కోరారు. అయితే.. వాదనలు పూర్తికాకపోవడంతో.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.

Whats_app_banner