TS Police Recruitment: త్వరలో ఎస్సై నియామక ఫలితాలు.. తర్వాతే కానిస్టేబుల్ రిజల్ట్-the board will announce the si recruitment results first and then the constable results ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Police Recruitment: త్వరలో ఎస్సై నియామక ఫలితాలు.. తర్వాతే కానిస్టేబుల్ రిజల్ట్

TS Police Recruitment: త్వరలో ఎస్సై నియామక ఫలితాలు.. తర్వాతే కానిస్టేబుల్ రిజల్ట్

HT Telugu Desk HT Telugu
Jul 06, 2023 09:59 AM IST

TS Police Recruitment: తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో చేపట్టిన ఎస్సై, కానిస్టేబుల్ నియామక ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మరో వారం పదిరోజుల్లో ఎస్సై రిక్రూట్‌మెంట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ తర్వాతే కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేస్తారు.

టీఎస్ ఎస్సై, కానిస్టేబుల్ ఫలితాలు
టీఎస్ ఎస్సై, కానిస్టేబుల్ ఫలితాలు (Image Credit : Unsplash )

TS Police Recruitment: మరో వారం పది రోజుల్లో తెలంగాణ పోలిస్ నియామక మండలి ఆధ్వర్యంలో చేపట్టిన ఎస్సై రిక్రూట్‌మెంట్‌ తుది ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుళ్ల నియామకాలకు గత ఏడాది విడుదలైన నోటిఫికేషన్‌లో ఇప్పటికే రాత పరీక్షలతో పాటు శారీరక సామర్ధ్య పరీక్షలను కూడా పూర్తి చేశారు.

ఎస్సై నియామక పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి కసరత్తు చేస్తోంది. ఎస్సై రిక్రూట్‌మెంట్‌ మెయిన్స్‌ రాత పరీక్షలో ఎంపికైన వారిలో నుంచి 97,175 మంది అభ్యర్థులు ధ్రువీకరణపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వీరి నుంచి కటాఫ్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితాను తయారు చేస్తారు.

ఎస్సైల ఎంపికకు తెలంగాణలోని మల్టీ జోన్లలోని పోస్టుల ఖాళీల ఆధారంగా, కానిస్టేబుళ్ల ఎంపికకు జిల్లాల్లోని ఖాళీలకు అనుగుణంగా కటాఫ్‌ మార్కుల్ని నిర్ణయిస్తున్నారు. సామాజికవర్గాల వారీగా, మహిళలు, పురుషులు, ప్రత్యేక కేటగిరీలు, రోస్టర్‌ పాయింట్లతో కూడిన 180కి పైగా అంశాలను పరిగణనలోకి తీసుకొని కటాఫ్‌ మార్కుల్ని నిర్ణయించాల్సి ఉంది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా పక్కాగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కటాఫ్‌ మార్కుల కసరత్తు పూర్తయిన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తామని నియామక మండలి చెబుతోంది. ఈ ప్రక్రియ మొత్తం సజావుగా సాగితే ఈ నెల రెండో వారంలో ఎస్సై నియామక పరీక్షలకు సంబంధించిన జాబితా వెలువడే అవకాశముంది.

ఎస్సై ఫలితాల తర్వాత కానిస్టేబుల్ రిజల్ట్స్…

రిజర్వేషన్లు, ఖాళీల లభ్యత, రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎస్సైలుగా ఎంపికైన 579 మందితో పాటు, ఏఎస్సైలుగా ఎంపికైన ఎనిమిది మంది జాబితాలను వెల్లడించనున్నారు. ఎస్సై మెయిన్స్‌ రాతపరీక్షకు ఎంపికైన 97,175 మందిలో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులు రెండింటికీ పరీక్షలు రాశారు.

ఎస్సైలుగా ఎంపికైన వారిని ప్రకటిస్తే బ్యాక్‌లాగ్‌లను నివారించవచ్చని పోలీస్ నియామక మండలి ఆలోచిస్తోంది. ఎస్సైగా ఎంపికైన వారి నుంచి కానిస్టేబుల్‌ పోస్టును వదులుకుంటున్నట్లు అండర్‌టేకింగ్‌ తీసుకుంటారు. ఇలా ఖాళీ అయిన కానిస్టేబుల్‌ పోస్టు స్థానంలో మరొకరిని ఎంపిక చేయడానికి వీలవుతుందని భావిస్తున్నారు.

Whats_app_banner