TG Govt New Emblem : మరిన్ని సంప్రదింపులు...! తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా
TG Govt New Emblem Updates : తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింద. కొత్త లోగోపై సంప్రదింపులు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
TG Govt New Emblem Updates : తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పులు సర్వత్రా చర్చనీయాంశగా మారింది. జూన్ 2వ తేదీన ఆవిష్కరించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన పలు నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. పలు నమూనాలను పరిశీలించగా… వీటిలో ఒకటిని ఫైనల్ చేసి ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న విడుదల చేయాలని భావించారు.
రాష్ట్ర చిహ్నంలో పలు మార్పులు చేయటంపై పలువర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వానికి అనేక సూచనలు రావటంతో మరిన్ని సంప్రదింపులు జరపాలని తాజా సర్కార్ నిర్ణయించింది. తొందరపాటుగా ముందుకెళ్లకుండా… మరిన్ని సంప్రదింపులు చేయాలని భావించింది. ఫలితంగా జూన్ 2వ తేదీన విడుదల చేయలనుకున్న తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం ఆవిష్కరణను వాయిదా వేయాలని నిర్ణయించింది.
ఇక జూన్ 2వ తేదీన కేవలం రాష్ట్ర గీతాన్ని మాత్రమే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చార్మినార్, కాకతీయ కళాతోరణాలతో రాష్ట్ర అధికార చిహ్నాన్ని రూపొందించింది. కాగా అందులో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని, అందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో… ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు.
నిరసనలకు సిద్ధమైన బీఆర్ఎస్….
అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం తొలగించడంపై ఓరుగల్లు జిల్లాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించడంతో పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఓరుగల్లు సంస్కృతిని ప్రతిబింబించే కళాతోరణం తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మరో ఉద్యమం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
కాకతీయ తోరణంలో కాకతీయుల పాలనా వైభవం ఉట్టిపడుతుంది. ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని చెప్పే నాలుగు పిల్లర్లు, చివరి రెండు పిల్లర్ల మీద ఇరుపక్కల గర్జించిన సింహాలు కాకతీయుల ఎదురులేని నాయకత్వానికి చిహ్నం. దాని పక్కన తల పైకెత్తిన మొసలి జలకళకు, రెండు హంసలు కాకతీయుల పారదర్శక పాలనకు, హంస కింద ఇరువైపుల చేతులు పైకెత్తిన కుబేరుల విగ్రహాలు ఆర్థిక పరిపుష్టికి, మొసలి కింది భాగంలో వజ్ర వైఢూర్యాల దండలు కాకతీయుల వైభవానికి, కిందిభాగాన బోర్లించిన ఏడు పూర్ణ కుంభాలు గ్రామ దేవతలకు ప్రతిబింబాలని చరిత్రకారులు చెబుతున్నారు.
కాకతీయుల కాలం నాటి వివిధ అంశాలను ప్రతిబింబించే చిహ్నాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రాజముద్రలో పొందుపరించింది. కాగా సమ్మక్క సారలమ్మలపై యుద్ధం చేసి, కాకతీయులు రాచరికాన్ని ప్రదర్శించారని, రాజముద్రలో అవే ఆనవాళ్లు కనపడుతున్నాయని సీఎం అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు అధికార చిహ్నంలో మార్పులు చేయగా, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు వరంగల్ లో ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు చార్మినార్ గుర్తును తొలగించటంపై కూడా తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… చార్మినార్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.