Bharat Jodo Yatra in Telangana: భారత్ జోడోతో హస్తం పార్టీ జోరు-telangana leg of bharat jodo yatra resumes after 4 day break ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bharat Jodo Yatra In Telangana: భారత్ జోడోతో హస్తం పార్టీ జోరు

Bharat Jodo Yatra in Telangana: భారత్ జోడోతో హస్తం పార్టీ జోరు

HT Telugu Desk HT Telugu
Oct 27, 2022 07:52 AM IST

Bharat Jodo Yatra in Telangana: తెలంగాణలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర దీపావళి నేపథ్యంలో నాలుగు రోజుల విరామం అనంతరం గురువారం ఉదయం తిరిగి ప్రారంభమైంది.

తెలంగాణలో ప్రవేశించినప్పుడు భారత్ జోడో యాత్రకు స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
తెలంగాణలో ప్రవేశించినప్పుడు భారత్ జోడో యాత్రకు స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు (AICC)

హైదరాబాద్, అక్టోబర్ 27: నాలుగు రోజుల తర్వాత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురువారం తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి తిరిగి ప్రారంభమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఉదయం 6.30 గంటలకు మక్తల్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పలువురు పార్టీ నేతలు రాహుల్ గాంధీతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇది రెండో రోజు యాత్ర. భారత్ జోడో యాత్ర అక్టోబరు 23 ఉదయం రాయచూర్ నుంచి కర్ణాటక బయల్దేరి గూడెబెల్లూర్ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఆదివారం మధ్యాహ్నం నుండి అక్టోబర్ 26 వరకు విరామం తీసుకున్నారు.

అక్టోబర్ 23న దేశ రాజధానికి బయల్దేరిన రాహుల్ గాంధీ, నిన్న రాత్రి తిరి వచ్చారు. రోడ్డు మార్గంలో గుడెబెల్లూర్‌కు బయలుదేరారు.

రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో పాదయాత్ర గురువారం నాటికి 26.7 కి.మీ పూర్తి అవుతుందని, ఈ రోజు రాత్రి మక్తల్‌లోని శ్రీ బాలాజీ ఫ్యాక్టరీ వద్ద ఆగిపోతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

బండ్ల గుంట లో లంచ్ బ్రేక్ ఉంటుందని, యలిగండ్ల శివారులో రాత్రి బస ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి.

మక్తల్ నుండి తెలంగాణ రాష్ట్రంలో 16 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. 19 అసెంబ్లీ, 7 పార్లమెంటరీ నియోజకవర్గాల మీదుగా 375 కి.మీ మేర భారత్ జోడో యాత్ర సాగుతుంది. నవంబర్ 7 న మహారాష్ట్రలో ప్రవేశిస్తుంది. నవంబర్ 4న యాత్రకు ఒకరోజు విరామం లభించనుంది.

తెలంగాణలో సాగే భారత్ జోడో యాత్ర సమయంలో మేధావులు, వివిధ సంఘాల నాయకులు, క్రీడా, వ్యాపార, వినోద రంగాలకు చెందిన ప్రముఖులతో రాహుల్ గాంధీ సమావేశమవుతారు.

యాత్ర సాగే మార్గం వెంబడి ప్రార్థనా మందిరాలు, మసీదులు, దేవాలయాలను కూడా ఆయన సందర్శించి ప్రార్థనలు చేస్తారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు తెలిపారు.

హైదరాబాద్ నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టేందుకు పీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. నెక్లెస్ రోడ్డులో బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది.

తెలంగాణ యాత్రను ప్రారంభించే ముందు రాహుల్ గాంధీ కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో మారథాన్ నడకను పూర్తి చేశారు.

యాత్రను సమన్వయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ 10 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.

Whats_app_banner