Telangana Teachers : తెలంగాణలో టీచర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం!
Telangana Teachers : టీచర్లకు సంబంధించి.. ఆన్ డ్యూటీలు, డిప్యుటేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 24న ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. అటు కొందరు ఉపాధ్యాయుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఆన్ డ్యూటీలు, డిప్యుటేషన్ల పేరుతో కోరుకున్న స్థానాలకు బదిలీ చేసేందుకు జారీ చేసిన జీవోను.. ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఓడీలు, డిప్యుటేషన్లపై ఐదుగురు అధికారులతో కమిటీని నియమిస్తూ మార్గదర్శకాలను రూపొందించి.. జులై 24న ఇచ్చిన ఉత్తర్వులను నిలిపేస్తూ.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తాజాగా ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణలో 20 వేల మంది ఉపాధ్యాయులు పదోన్నతులు, మరో 30 వేల మంది బదిలీలు పొందారు. మొత్తం టీచర్లలో సగం మంది ట్రాన్స్‌ఫర్ అయ్యారు. తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారికి ప్రత్యేక పాయింట్లు ఇచ్చి.. వారు కోరుకున్న ప్రాంతానికి పంపించారు. అయినా కూడా పెద్ద సంఖ్యలో తమకు స్థానచలనం కలిగించాలని టీచర్లు కోరుతున్నారు.
తమకు ట్రాన్స్‌ఫర్ కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులకు ఉపాధ్యాయులు ఇంకా వినతులు ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులు వాటిని విద్యా శాఖకు పంపిస్తున్నారు. అందుకే విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్నామని.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జులైలో ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే.. ఏదో ఒక కారణం చెప్పి బదిలీలకు అవకాశమిస్తే.. చదువు చెప్పేదెవరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో టీచర్లే ఉండరని ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలిసింది. అందుకే జులైలో ఇచ్చిన ఉత్తర్వులను నిలిపేస్తున్నట్లు వెంకటేశం ఆగస్టు 31న ఉత్తర్వులు ఇచ్చారు. అవి 10 రోజుల తర్వాత బయటకు వచ్చాయి. తాము ప్రత్యేకంగా సూచించే వరకు ఆయా విభాగాలు ప్రతిపాదనలు పంపొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.