Telangana Govt Jobs : మరో 2,910 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్-telangana govt jobs 2022 ts govt green signal for 2910 posts check here details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Govt Jobs 2022 Ts Govt Green Signal For 2910 Posts Check Here Details

Telangana Govt Jobs : మరో 2,910 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

HT Telugu Desk HT Telugu
Aug 30, 2022 10:19 PM IST

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరో 2,910 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. 2,910 పోస్టులకు పచ్చజెండా ఊపింది. 663 గ్రూప్‌-2 ఉద్యోగాలు, 1373 గ్రూప్‌-3 ఉద్యోగాల భర్తీ చేసేందుకు అనుమతించింది. పశుసంవర్థక శాఖలో 294, గిడ్డంగుల సంస్థలో 50, విత్తన ధ్రువీకరణ సంస్థలో 25 పోస్టులతోపాటు పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేయనుంది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ.. ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రూప్​-2 ఉద్యోగాల్లో జీఏడీ ఏఎస్ఓ పోస్టులు 165, పంచాయతీరాజ్ ఎంపీఓ పోస్టులు 125, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 98, ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు 97, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు 59 ఉన్నాయి. 38 చేనేత ఏడీఓ పోస్టులు, 25 ఆర్థికశాఖ ఏఎస్ఓ పోస్టులు, 15 అసెంబ్లీ ఏఎస్ఓ పోస్టులు, 14 గ్రేడ్ టూ సబ్ రిజిస్ట్రార్ పోస్టులు, 11 గ్రేడ్ త్రీ మున్సిపల్ కమిషనర్ పోస్టులు, తొమ్మిది ఏఎల్ఓ, ఆరు న్యాయశాఖ ఏఎస్ఓ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.

గ్రూప్-3 ఉద్యోగాల్లో మొత్తం 99 విభాగాధిపతులు, కేటగిరీల పరిధిలో 1373 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది. వ్యవసాయశాఖలో 199 గ్రేడ్-2 ఏఈఓ పోస్టులు, 148 ఏఓ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఉద్యానవన శాఖలో 21 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. సహకారశాఖలో 63 అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి. 36 జూనియర్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.

పశుసంవర్ధకశాఖలో 183 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, 99 వెటర్నరీ అసిస్టెంట్ సహా 294 పోస్టుల భర్తీకి అనుమతి మంజూరైంది. విత్తన ధృవీకరణ సంస్థలో 19 సీడ్ సర్టిఫికేషన్ అధికారి, ఆరు ఆర్గానిక్ ఇన్ స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మత్య్సశాఖలో తొమ్మిది ఎఫ్​డీఓ, నాలుగు ఏడీ, రెండు అసిస్టెంట్ ఇన్​స్పెక్టర్ పోస్టులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకుల పరిధిలో 12 పోస్టులు ఉంటాయి. ఇంధనశాఖలో 11 సహాయ ఎలక్ట్రికల్ పోస్టులు, గిడ్డంగుల సంస్థలో 28 ఏడబ్ల్యూఎం, 14 మేనేజర్ సహా 50 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ అనుమతితో ఉద్యోగాల నియామక ప్రక్రియలో 50 వేల మైలురాయిని అధిగమించినట్లు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.

ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన వెంటనే నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 52,460 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. తాజాగా గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావడంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టుల కోసం నోటిఫికేషన్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు అత్యధిక పోటీ ఉండనుంది.

IPL_Entry_Point