Warangal : పరకాలలో అక్రమ దందాలపై టాస్క్ ఫోర్స్ ఫోకస్.. ఫైర్ క్రాకర్స్, పొగాకు ప్రొడక్ట్స్ స్వాధీనం
Warangal : దసరా, దీపావళి సమీపిస్తున్న వేళ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫైర్ క్రాకర్స్ దందా జోరుగా నడుస్తోంది. పర్మిషన్లు లేకుండానే వివిధ రకాల టపాసులను గోదాముల్లో నింపేస్తున్నారు. హోల్ సేల్, రిటైల్ ధరలకు విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. వీరిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దందాపై నిఘా పెట్టారు.
హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తున్న.. ఫైర్ క్రాకర్స్ దందాకు టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ పెట్టారు. దాదాపు 12 లక్షల 39 వేల రూపాయల విలువైన వివిధ రకాల టపాసులను సీజ్ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పరకాల పట్టణ కేంద్రానికి చెందిన ఎర్రం రవీందర్, చిదురాల శ్రీనివాస్ అనే ఇద్దరు టపాసుల దందా సాగిస్తున్నారు. వరంగల్ నగరంతో పాటు జనగామ, జమ్మికుంట తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టపాసులు తీసుకురావడం, ఎలాంటి పర్మిషన్లు లేకుండానే స్టోర్ చేసి బిజినెస్ నడిపిస్తున్నారు. కొన్నేళ్లుగా ఇదే దందా కొనసాగిస్తుండగా.. తాజాగా వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది.
శుక్రవారం రాత్రి సమయంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆదేశాల మేరకు.. సీఐ సార్ల రవి కుమార్, ఎస్సై బి.శరత్ కుమార్ ఆధ్వర్యంలో ఎర్రం రవీందర్‌కు సంబంధించిన గోదాంలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో 12 లక్షల 39 వేల రూపాయల విలువైన క్రాకర్స్ బయటపడగా.. వాటన్నింటినీ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఎర్రం రవీందర్, చిదురాల శ్రీనివాస్ తోపాటు స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి విచారణ నిమిత్తం పరకాల పోలీసులకు అప్పగించారు.
ఎర్రం రవీందర్, చిదురాల శ్రీనివాస్ కు సంబంధించిన గోదాంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో.. టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రభుత్వ నిషేధిత పొగాకు ప్రొడక్ట్స్‌ను గుర్తించారు. కొంతకాలంగా వీళ్లు గుట్కా దందా చేస్తున్నట్లుగా గుర్తించి, అక్కడ అక్రమంగా నిల్వ చేసి ఉంచిన దాదాపు లక్షా 58 వేల 450 రూపాయల విలువైన వివిధ రకాల గుట్కా, పొగాకు ప్రొడక్ట్స్‌ను సీజ్ చేశారు. వాటిని కూడా పరకాల పోలీసులకు అప్పగించారు.
ఎర్రం రవీందర్ గోదాంలో తనిఖీ అనంతరం పోలీసులు.. పరకాల వెజిటేబుల్ మార్కెట్ సమీపంలోని బొడ్రాయి రోడ్డు వద్ద గుట్కా బిజినెస్ చేస్తున్న పూరెళ్ల సత్యనారాయణకు చెందిన కావ్య కిరాణంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన వివిధ రకాల పొగాకు ప్రొడక్ట్స్ గుర్తించారు. దాదాపు రూ.77 వేల 300 విలువైన గుట్కా ప్యాకెట్లు గుర్తించి, వాటిని సీజ్ చేశారు.
నిందితుడు పూరెళ్ల సత్యనారాయణతో పాటు స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లను.. మిగతా విచారణ కోసం పరకాల పట్టణ పోలీసులకు అప్పగించారు. ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా ఫైర్ క్రాకర్స్ దందా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)