KCR Yagam: యాగం ఫలితాలపై ఆయన చెప్పినా కేసీఆర్ వినలేదట...!
KCR Yagam: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించేందుకు దేవతల్ని ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన దీక్ష ఫలితం ఇవ్వదని ఓ స్వామిజీ ముందే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.ఫలితాలతో సంబంధం లేకుండా, కేసీఆర్ సమ్మతితోనే సదరు స్వామిజీ ఆ యాగాన్ని పూర్తి చేశారట...
KCR Yagam: హిందూ వైదిక క్రతువుల మీద అపార విశ్వాసాన్ని ప్రదర్శించే బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఓ క్రతువు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో యాగాల నిర్వహణతో గుర్తింపు పొందిన ఓ పీఠం ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు తెలంగాణలో ఎన్నికలకు ముందు జరిగింది.
ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీకి భగవంతుడి ఆశీర్వాదం దక్కుతుందనే విశ్వాసంతో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. కేసీఆర్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజుకు రెండు, మూడు నియోజక వర్గాల్లో పర్యటిస్తున్న సమయంలోనే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దాదాపు ఐదు రోజుల పాటు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సతీసమేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బిఆర్‌ఎస్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు రాజకీయ నాయకులు, మంత్రులు సైతం ఎన్నికల్లో భగవంతుడి అనుగ్రహం తమకు దక్కేలా యాగాలు, శాంతి పూజలకు సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో ఇటీవల ఓ స్వామిజీ ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న బడా పారిశ్రామికవేత్త ఆయన సంప్రదించినట్టు తెలుస్తోంది. కోస్తా జిల్లాలకు చెందిన సదరు వ్యక్తి తనతో పాటు తన కుమారుడిని కూడా ఈ సారి ఎన్నికల బరిలో దింపాలని భావిస్తున్నారు. స్వామిజీ ఆశీస్సులు ఉంటే ఓ పార్టీలో టిక్కెట్ ఖాయమనే భావనలో ఉన్నారు. దీంతో ఆయన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
యాగాల నిర్వహణ, దాని ఫలితాలను వివరించే క్రమంలో తెలంగాణలో బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తలపెట్టిన యాగం పెద్దగా ఫలితం ఇవ్వదని ముందే తనకు తెలుసని సదరు స్వామిజీ చెప్పడంతో, ఆయన ఆశీస్సుల కోసం వెళ్లిన వ్యక్తి అవాక్కైనట్లు తెలుస్తోంది.
యాగం నిర్వహణ ద్వారా ఆశించిన ఫలితం దక్కకపోవచ్చని, దానికి రకరకాల కారణాలను సైతం వివరించినా కేసీఆర్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారని తెలుస్తోంది. యాగం తలపెట్టిన వారి సమ్మతితోనే ఆ క్రతువు పూర్తి చేసినట్లు స్వామిజీ వివరించారట.
దీంతో ఆ స్వామిజీ ఆశీస్సుల కోసం వెళ్లిన వ్యక్తి పునరాలోచనలో పడ్డట్టు సన్నిహితులకు చెబుతున్నారు. కేసీఆర్ వంటి వారికే స్వామిజీ యాగాలు ఫలించకపోతే తమ వంటి వారి పరిస్థితి ఏమిటని మిత్రుల వద్ద అక్రోశం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా యాగాల నిర్వహణ పేరొందిన పీఠాధిపతి స్వయంగా సదరు నాయకుడికి చెప్పినట్టు తెలుస్తోంది.