Hyderabad Crime : హోటల్‌లో యువతి మృతి.. రూమ్‌లో రక్తపు మరకలు, భారీగా మద్యం బాటిళ్లు!
Hyderabad Crime : హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో విషాదం జరిగింది. రెడ్‌స్టోన్ హోటల్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అయితే.. రేప్ చేసి ఉరి వేసి చంపారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
హైదరాబాద్ నగరం గచ్చిబౌలిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. రెడ్‌స్టోన్ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. యువతి మృతిపై హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హోటల్ రూమ్‌ను పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. హోటల్ రూమ్‌లో రక్తపు మరకలు, భారీగా మద్యం బాటిళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
రేప్ చేసి చంపేశారు.. బంధువుల ఆరోపణ..
మృతురాలు జడ్చర్లకు చెందిన యువతిగా గుర్తించారు. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆ యువతి స్టాఫ్‌నర్స్‌గా పని చేసేదని ఆమె బంధువులు చెబుతున్నారు. అయితే.. తన స్నేహితులు మోనా, జీవన్‌తో కలిసి యువతి హోటల్‌కు వెళ్లిందని ఆమె బంధువులు చెబుతున్నారు. రేప్ చేసి ఉరి వేసి చంపారని కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇష్యూలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
ప్రియుడి పీక కోసిన ప్రియురాలు..
ప్రేమించానంటూ వెంటపడి.. ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండా తాత్సారం చేస్తుండటంతో ఓ యువతి ప్రియుడిపై దాడి చేసింది. నర్సుగా పనిచేసే యువతి సర్జికల్ బ్లేడుతో ప్రియుడి పీక కోసింది. ఈ ఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హైదరాబాద్‌లోని న్యూ బోయిన్‌పల్లి పెద్దతోకట్టకు చెందిన హరికృష్ణ ప్లంబర్‌గా పని చేస్తున్నాడు. ఐదేళ్లుగా న్యూబోయిన్‌పల్లి కంసాలి బజార్‌కు చెందిన నర్సును ప్రేమిస్తున్నాడు. తమకు వివాహం చేయాలని హరికృష్ణ తండ్రి యాదయ్యను ఇద్దరూ గతంలో కోరారు. ఏడాది పాటు ఆగితే పెళ్లి చేస్తానని యాదయ్య వారికి సర్ది చెప్పాడు.
సెప్టెంబర్ 14 శనివారం రాత్రి 8 గంటల సమయంలో హరికృష్ణ వాకింగ్ చేయడానికి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత హరికృష్ణ తండ్రి యాదయ్యకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి న్యూ బోయిన్‌పల్లి జయనగర్‌కాలనీలో హరికృష్ణకు, యువతి మధ్య గొడవ జరిగిందని, ఆమె సర్జికల్ బ్లేడుతో ప్రియుడి మెడపై దాడిచేసి పారిపోయిందని చెప్పాడు.
దీంతో యాదయ్య ఘటనా స్థలానికి చేరుకొని కుమారుడు హరికృష్ణను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాడు. ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి కారణాలను ఆరా తీస్తున్నారు.