Nalgonda Congress Suspense: నల్లగొండలో ఆ మూడు సీట్లపై వీడని పీఠముడి
Nalgonda Congress Suspense: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఇంకా సస్పెన్స్‌తో ఉత్కంఠకు గురవుతున్నారు. మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పార్టీ హై కమాండ్ ఇప్పటికే 9 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. కానీ, మరో 3 నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థుల లెక్క తేలడం లేదు.
Nalgonda Congress Suspense: ఉమ్మడి నల్లగొండలో ఎలాంటి వివాదాలు, టికెట్ కోసం పోటీ లేని ఆరు నియోజకవర్గాల పేర్లను తొలి జాబితాలోనే ప్రకటించారు. రెండో జాబితాలో మిగతా ఆరు నియోజకవర్గాలకు టికెట్లు ఖరారు చేస్తారని భావించినా, కేవలం ముగ్గురికి మాత్రమే టికెట్లు ఇచ్చి మరో మూడు స్థానాలను పెండింగ్ లో పెట్టింది.
రెండో జాబితాలో ఇచ్చిన టికెట్లలో మునుగోడు మాత్రమే వివాదాస్పదం అవుతోంది. 2022 మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన పాల్వాయి స్రవంతి నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనకే టికెట్ అని భరోసాతో ఉన్న చలమల్ల క్రిష్ణారెడ్డి తిరుగుబాటు ప్రకటన చేశారు. తాను ఇండిపెండెంటుగానైనా బరిలో ఉంటానని పేర్కొంటున్నారు.
ఈ వివాదానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీలో చేరిన తెల్లారి టికెట్ ప్రకటించడం కారణం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించినా, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోచేరి, ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు.
అక్కడ పరిస్థితులు సవ్యంగా లేవని గుర్తించి తిరిగి సొంత గూటికి చేరారు. మధ్యలో పదిహేను నెలల కాలంలో పార్టీకి అండగా నిలిచినవారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పటిదాకా ప్రకటించిన 9 టికెట్లలో ఒక్క మునుగోడు లో మాత్రమే ఈ పరిస్థితి కనిపిస్తోంది. కాగా, మిగిలిన మూడు స్థానాల అభ్యర్థుల ఖరారు విషయంలో సస్పెన్స్ వీడడం లేదు.
మూడు స్థానాలపై ... పీఠముడి
జిల్లాలో ఇంకా తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడెం నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు కాలేదు. తుంగతుర్తి నుంచి గత రెండు 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అద్దంకి దయాకర్ మూడో సారి కూడా టికెట్ ఆశిస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన పిడమర్తి రవి, మొన్నమొన్ననే పార్టీ గూటికి వచ్చిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టికెట్ ఆశిస్తుండడంతో అధినాయకత్వం ఎటూ తేల్చలేక పోతోంది.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో మోత్కుపల్లి నర్సింహులు తెలుగుదేశం అభ్యర్థిగా తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఉన్నారు. కాబట్టి తనకు గెలుపు అవకాశాలు ఉంటాయని టికెట్ కోరుతున్నారు.
జిల్లాలో మరో ప్రధాన నియోజకవర్గం సూర్యాపేట. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో సూర్యాపేటలో కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితం అయ్యింది. 2018 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. స్వల్ప మెజారిటీలో ఈ స్థానాన్ని కోల్పోయింది. రెండు సార్లూ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి ఈ సారి కూడా టికెట్ ఆశిస్తున్నారు.
మరో వైపు టీడీపీ నుంచి రేవంత్ రెడ్డితో వచ్చి కాంగ్రెస్ లో చేరిన పటేల్ రమేష్ రెడ్డి టికెట్ కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ ఇద్దరు నాయకుల మధ్య టికెట్ పోటీ ఎక్కువగా ఉండడంతో హై కమాండ్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వస్తున్నకారణంగానే అభ్యర్థి ఖరారు విషయంలో ఆలస్యం జరుగుతోందని అభిప్రాయ పడుతున్నారు.
కాంగ్రెస్ కు తలనొప్పిగా మారిన ఇంకో నియోజకవర్గం మిర్యాలగూడెం. వామపక్ష పార్టీల పొత్తులో భాగంగా సీపీఎం మిర్యాలగూడెం సీటును ఆశిస్తోంది. కాంగ్రెస్ నుంచి కూడా టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 18 మంది నాయకులు టీపీసీసీ నాయకత్వానికి టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నా చివరకు రేసులో మిగిలింది మాత్రం బత్తుల లక్ష్మారెడ్డి ఒక్కరే.
పార్టీ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి పెద్ద తనయుడు రఘువీర్ రెడ్డి కూడా టికెట్ ఆశించినా.. అధిష్టానం ఒత్తిడితో చివరకు ఆయన రేసు నుంచి వైదొలిగారు. బత్తుల లక్ష్మారెడ్డి మాత్రం టికెట్ కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. సీపీఎంకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ కేటాయించవద్దని ఈయన వర్గం డిమాండ్ చేస్తోంది.
సీపీఎంతో టికెట్ల పంపకం ఓ కొలిక్కి రాకపోవడం కూడా కాంగ్రెస్ ఈ సీటు విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ మూడు స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )