Vinayaka Chavithi Tragedy : లడ్డూ వేలంపాటలో పాల్గొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఇంటికెళ్లిన కాసేపటికే మృతి!
Vinayaka Chavithi Tragedy : అతనో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. గణపతి అంటే భక్తి ఎక్కువ. అందుకే లడ్డూ వేలంలో పాల్గొని రూ.15 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. అందరితో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేశారు. కానీ.. ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. అదే ఆఖరి తీన్‌మార్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.
రంగారెడ్డి జిల్లా మణికొండలోని అల్కాపూరి కాలనీలో తీవ్ర విషాదం జరిగింది. గణేష్ ఉత్సవ కమిటీ లడ్డూ వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆకస్మికంగా మృతిచెందారు. దీంతో ఆయన కుటుంబం, అల్కాపూరి కాలనీ విషాదంలో మునిగిపోయింది. అతని బంధువులు, స్నేహితులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
అల్కాపూరి కాలనీకి చెందిన శ్యామ్ ప్రసాద్.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. వినాయక చవితి సందర్భంగా అల్కాపూరి టౌన్ షిప్‌లో గణపతిని ప్రతిష్టించారు. తాజాగా.. గణేష్ ఉత్సవ కమిటీ లడ్డూ వేలంపాట నిర్వహించింది. ఈ వేలంపాటలో పాల్గొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్.. 15 లక్షల వరకు వేలంపాట పాడి గణపతి లడ్డూను దక్కించుకున్నారు.
లడ్డూను దక్కించుకున్న సందర్భంగా.. గణనాథుడి మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ.. స్నేహితులతో శ్యామ్ ప్రసాద్ ఎంజాయ్ చేశారు. కానీ.. ఆ ఆనందం గంటల్లోనే ఆవిరి అయ్యింది. శ్యామ్ ప్రసాద్ ఇంటికి వెళ్లగానే గుండె పోటు వచ్చింది. దీంతో కుప్పకూలిపోయాడు. శ్యామ్ ప్రసాద్ గుండెపోటుతో మృతిచెందాడు.
భక్తుల రద్దీ..
ఖైరతాబాద్ మహా గణపతి వద్ద భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల రాకతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. చివరి రోజు దర్శనం కోసం ఎగబడుతున్న భక్తులు భారీగా తరలివచ్చారు. గంట గంటకు భక్తుల రద్దీ పెరిగింది. దీంతో : నాంపల్లి , అబిడ్స్ , అసెంబ్లీ, ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉదయం నుంచి రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. గణేష్ నిమజ్జనం, హాలిడే కావడంతో ఉదయాన్నే రోడ్లపైకి వచ్చారు భాగ్యనగర ప్రజలు.
నిమజ్జనానికి ఏర్పాట్లు..
మరోవైపు ఖైరతాబాద్ గణేషుడి వద్ద షెడ్ వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. రాత్రి 9 గంటలకు మహాగణపతికి కలశపూజ నిర్వహించనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలలోపు సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనం జరుగుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు.