Armur MLA Jeevanreddy: జీవన్ రెడ్డికి షాక్.. అప్పు చెల్లించాలంటూ నోటీసులు
Armur MLA Jeevanreddy: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ షాక్ ఇచ్చింది. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలంటూ ఇంటికి నోటీసులు అంటించారు. అసలు, అప్పును వారం రోజుల్లో తిరిగి చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Armur MLA Jeevanreddy: బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రూ.20కోట్ల రుపాయలు రుణాన్ని తక్షణం చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. తీసుకున్న అప్పుకు జీవన్ రెడ్డి కనీసం వడ్డీ కూడా చెల్లించడం లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. తక్షణం రుణం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంటూ ఇంటి గోడలకు అంటించారు.
కొద్ది రోజుల క్రితమే జీవన్ రెడ్డికి చెందిన మాల్‌ను అధికారులు సీజ్ చేశారు. ఆర్మూర్ నగరం మధ్యలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ లీజు నిబంధనలు ఉల్లంఘించడంతో ఆర్టీసీ అధికారులు మాల్ సీజ్ చేశారు. కోట్లలో జీవన్ రెడ్డి బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
తాజాగా సోమవారం ఆర్మూర్‌లోని జీవన్ రెడ్డి నివాసానికి నోటీసులు అంటించారు. రూ.20కోట్ల రుపాయల అప్పును తిరిగి చెల్లించక పోవడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
మాల్ నిర్మాణం కోసం ఆరేళ్ల క్రితం భార్య పేరుతో జీవన్ రెడ్డి రుణం తీసుకున్నారు. 2017లో తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించకపోవడంతో పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లించకపోవడంతో అధికారులు చట్ట పరమైన చర్యలకు సిద్ధమయ్యారు. రూ.20కోట్ల రుణంతో పాటు మరో రూ.20కోట్ల రుపాయల వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వారం రోజుల్లో బకాయిలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
2017 జులైలో జీవన్ రెడ్డి మాల్ నిర్మాణం కోసం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేయడంతో అప్పటి ప్రభుత్వం రుణాన్ని మంజూరు చేసింది. మాల్ నిర్మాణం పూర్తైనా దానిని తిరిగి చెల్లించడంలో విఫలం అయ్యారు. రుణ వసూలు కోసం అధికారులు పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.
ఆర్మూర్‌లో పట్టణంలో ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకుని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ నిర్మాణం చేపట్టారు. లీజు బకాయిలు కూడా చెల్లించక పోవడంతో మాల్‌ను ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. ఆర్టీసీ అధికారులకు రూ.7కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. అదే సమయంలో విద్యుత్ శాఖకు రూ.2కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ కనెక్షన్లను తొలగించారు.