Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి 48 ప్రత్యేక రైళ్లు
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండగల సమయంలో ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టింది. 48 ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. వీటితో రద్దీ భారీగా తగ్గే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి పండగలకు సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. దీంతో రైళ్లలో రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 48 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 5 వరకు వేర్వేరు తేదీల్లో ఈ స్పెషల్ ట్రైన్స్ రాకపోకలు సాగించనున్నాయి.
ప్రధాన నగరాల నుంచి..
దసరా, దీపావళి, ఛాత్ పండగల నేపథ్యంలో రైల్వే అధికారులు స్పెషల్ ట్రైన్స్ నడపాలని నిర్ణయించారు. కాచిగూడ - తిరుపతి - కాచిగూడ, సికింద్రాబాద్ - నాగర్‌సోల్ - సికింద్రాబాద్, కాకినాడ - సికింద్రాబాద్ - కాకినాడ, తిరుపతి - మచిలీపట్నం - తిరుపతి మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. రెగ్యులర్ రైళ్లకు ఇవి అదనపు సర్వీసులు అని రైల్వే అధికారులు వెల్లడించారు.
వరుస పండగలు..
వరుస పండగల నేపథ్యంలో.. రైల్వే టికెట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. సొంతూళ్లకు వెళ్లేవారు ఎక్కువగా రైళ్లలోనే వేళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు గమనించి ఈ ప్రత్యేక రైళ్లను ప్రయాణానికి వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.