Bail For Johnny Master : జానీ మాస్టర్‌కు రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు-ranga reddy district court granted interim bail to johnny master ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bail For Johnny Master : జానీ మాస్టర్‌కు రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు

Bail For Johnny Master : జానీ మాస్టర్‌కు రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు

Basani Shiva Kumar HT Telugu
Oct 03, 2024 12:05 PM IST

Bail For Johnny Master : లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌కు కాస్త ఊరట లభించింది. జానీకి ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్‌‌ను కోర్టు మంజూరు చేసింది. జానీ మాస్టర్ తనకు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ కోరుతూ.. పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం మంజూరు చేసింది.

జానీ మాస్టర్‌
జానీ మాస్టర్‌ (X)

జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు అయ్యింది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేస్తూ.. రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కోరుతూ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఐదు రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని బెయిల్ పిటిషన్‌లో కోరారు. ఢిల్లీలో ఉత్తమ నృత్య దర్శకుడిగా (నేషనల్ అవార్డు) అందుకోవాల్సి ఉందని.. కోర్టును జానీ తరుపు న్యాయవాదులు కోరారు.

జానీ మాస్టర్ కేసులో 5 రోజుల కిందట కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన బాధితురాలపై.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్‌గా పని చేయడం కోసం.. తన భర్తను ట్రాప్ చేసి.. ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసిందని ఫిర్యాదులో ఆరోపించారు. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో చూపించిందని.. తాను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని జానీ మాస్టర్ భార్య ఆరోపించారు.

అటు జానీ మాస్టర్‌‌‌ను పోలీసులు ఇంటరాగేట్ చేశారు. లాయర్ సమక్షంలో జానీ మాస్టర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. కేసులో కీలమైన టెక్నికల్‌ ఎవిడెన్స్‌ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బాధితురాలి నుంచి రెండుసార్లు స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసిన పోలీసులు.. ఇప్పుడు జానీ మాస్టర్‌ నుంచి సమాచారం రాబట్టడానికి ప్రయత్నించారు.

పోలీసుల విచారణలో జానీ మాస్టర్ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. బాధితురాలు సమర్పించిన ఆధారాలను ముందుపెట్టి.. జానీ మాస్టర్‌ను పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం. అయితే.. బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్‌ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఒక షో సమయంలో బాధితురాలు తనకు తానే పరిచయం చేసుకున్నట్లు పోలీసులకు జానీ మాస్టర్ చెప్పినట్టు సమాచారం.

తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని జానీ మాస్టర్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. బాధితురాలు మైనర్‌గా ఉన్న సమయంలో తాను లైంగిక దాడి చేశానన్నది అబద్ధమని చెప్పినట్టు సమాచారం. కేవలం ఆ యువతి ట్యాలెంట్‌ను గుర్తించి.. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చినట్లు జానీ మాస్టర్ చెప్పినట్టు తెలిసింది. తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలే హింసించేదని.. ఈ విషయంలో చాలాసార్లు బెదిరింపులకు దిగినట్లు పోలీసు విచారణలో వెల్లడించారు.

Whats_app_banner