Cyber Crime : లోకల్ యాప్ లో ఉద్యోగాల ప్రకటనలతో సైబర్ మోసాలు- ఐదుగురు అంతర్రాష్ట్ర కేటుగాళ్లు అరెస్ట్
Cyber Crime : ఏపీకి చెందిన ఐదుగురు ఓ ఫేక్ కంపెనీ పేరుతో ఉద్యోగాలు కల్పిస్తామని లోకల్ యాప్ లో ప్రకటనలు ఇస్తూ మోసాలకు తెరలేపారు. సిరిసిల్లకు చెందిన యువతి ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Cyber Crime : TRANZ INDIA Corporation Network అనే కంపెనీ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడే ముఠా గుట్టురట్టయ్యింది. ఏపీ, తెలంగాణలో ఉద్యోగాల ప్రకటనలతో మోసం చేస్తున్న ముఠాకు చెందిన ఐదుగురిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ల్యాప్ టాప్, 5 మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని వారి బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటించారు.
ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన ఎర్రబద్ది గోపి, కురుబా అశోక్ కుమార్, మాదిగ బ్రహ్మేంద్ర, సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన మాదిగ స్వాతి సంజీవప్ప, కురుబ వరలక్ష్మి కలకంద ఐదుగురు కలిసి TRANZ INDIA కార్పొరేషన్ నెట్ వర్క్ అనే కంపెనీ పేరుతో మోసాలకు తెరలేపారని తెలిపారు. అనంతపురం జిల్లాలో లోకల్ యాప్ లో health care, personal care, home Care, passion wear, Gold and Diamonds వాటి ఉత్పత్తి కంపెనీల నుంచి కస్టమర్లకు డైరెక్ట్ సేల్స్ చేస్తామని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇవ్వగా అదే కంపెనీ లో పని చేస్తున్న అశోక్, వరలక్ష్మి, బ్రహ్మేంద్ర, స్వాతి లు కలసి ప్రకటనలు చూసి ఉద్యోగం గురించి అడిగే వారికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ నమ్మకం కలిగించేలా మాట్లాడి ఆశ కల్పిస్తూ వారి వద్ద నుండి 10,000 రూపాయల వరకు డబ్బులను తీసుకొని వారికి కంపెనీ యొక్క ID కార్డు ఇచ్చేవారు. వారిని మరి కొంత మందిని కంపెనీలో చేర్పించాలని తద్వారా కమిషన్ వస్తుందని లేదా వారు చెల్లించిన డబ్బులకు కేవలం 1000 రూపాయల విలువ గల వస్తువులను మాత్రమే వారికి ఇచ్చేవారని తెలిపారు. ఇలా నిరుద్యోగులను మల్టీ లెవల్ మార్కెటింగ్ విధానంలో కంపెనీలో చేర్చుకుంటూ ఆఫీసు యజమాని గోపి కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో కమిషన్ పొందేవాడని ఎస్పీ చెప్పారు.
సిరిసిల్లకు చెందిన మహిళతో వెలుగులోకి
వారి ప్రకటనలు చూసిన సిరిసిల్లకు చెందిన దూస రమ్య అనే మహిళ జాబ్ కావాలని మెసేజ్ చేయగా జాబ్ ఇస్తానంటూ నమ్మబలికారు. మొదటగా Job verification కోసం 400 రూపాయలు అడుగగా రమ్య ఫోన్ పే ద్వారా పంపింది. ఆమెతో ఫోన్లలో మాట్లాడి జాబ్ వచ్చిందని నమ్మించగా ఐడీ క్రియేషన్ కోసం రూ.5000 రమ్యని అడుగగా ఆ డబ్బులూ పంపించింది. ఆ తర్వాత ఆమెకు మార్కెటింగ్ లో తమ కంపెనీకి సంబంధించిన వస్తువులు అమ్మాలని చెప్పారు. రమ్య జాబ్ అని చెప్పి, ఇప్పుడు మార్కెటింగ్ అని చెపుతున్నారని అడగగా మరో 5000 పంపిస్తే వేరే జాబ్ ఇపిస్తామని చెప్పారు. రమ్య మళ్లీ రూ.5000 పంపింది. ఆ తరువాత వాళ్లు రెస్పాండ్ కాకపోవడంతో మోసం చేశారని గ్రహించిన రమ్య సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రమ్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో జాబ్ పేరుతో మల్టీ లెవెల్ చైన్ మార్కెటింగ్ నెట్ వర్క్ మోసం బయటపడిందని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అనంతపురం జిల్లా శారదానగర్ లో అరెస్టు చేశామని చెప్పారు.
10కి పైగా ఫిర్యాదులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో TRANZ INDIA Corporation Network కంపెనీపై NCRP Portal లో 10కి పైగా ఫిర్యాదులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఫిర్యాదులపై FIR నమోదు చేశామని, ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్.
రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందూస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం