Ganja Smuggling : అంబులెన్స్‌లో గంజాయి స్మగ్లింగ్.. వీడు పుష్పకే గురువులా ఉన్నాడు కదా!-police caught smuggling ganja in ambulance in bhadradri kothagudem district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ganja Smuggling : అంబులెన్స్‌లో గంజాయి స్మగ్లింగ్.. వీడు పుష్పకే గురువులా ఉన్నాడు కదా!

Ganja Smuggling : అంబులెన్స్‌లో గంజాయి స్మగ్లింగ్.. వీడు పుష్పకే గురువులా ఉన్నాడు కదా!

Basani Shiva Kumar HT Telugu
Sep 15, 2024 02:26 PM IST

Ganja Smuggling : గంజాయి స్మగ్లర్లు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. అయినా పోలీసులు మాటు వేసి పట్టుకుంటున్నారు. తాజాగా అంబులెన్స్‌లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ గంజాయి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. అంబులెన్స్‌ను సీజ్ చేశారు.

అంబులెన్స్‌లో గంజాయి స్మగ్లింగ్
అంబులెన్స్‌లో గంజాయి స్మగ్లింగ్ (Image source from https://istockphoto.com)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో కోట్లాది విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి తమిళనాడుకు అంబులెన్స్‌లో గంజాయి తరలిస్తుండగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్వింటాళ్ల మేర గంజాయిని 2 వ టౌన్ పోలీసులు రామవరంలో పట్టుకున్నారు. గంజాయి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంబులెన్సును సిజ్ చేసి.. డ్రైవర్, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్ అయితే.. ఎవరికీ అనుమానం రాదని.. అందుకే దాంట్లో తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కూడా కొత్తగూడెంలో రూ.87 లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

ఏవోబీ నుంచి తెలంగాణకు..

ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బార్డర్) నుంచి గంజాయి రవాణా జోరుగా సాగుతోంది. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాలు, రైళ్లలో గంజాయిని తరలిస్తున్నారు. అడవి మార్గం గుండా వస్తే ఎవరికీ అనుమానం రాదని.. ఏజెన్సీ ప్రాంతాల నుంచి ప్రధాన పట్టణాలకు చేరుస్తున్నారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని అడవి మార్గాల్లో గంజాయి రవాణా జరుగుతోందని పోలీసులు నిఘా పెంచారు. చాలాసార్లు పట్టుకున్నారు. ఇటు తెలంగాణ పోలీసులు కూడా గంజాయి రవాణాపై గట్టి నిఘా పెట్టారు.

కొత్తగూడెం దాటితే..

భద్రాద్రి కొత్తగూడెం నుంచి వరంగల్ జిల్లా నర్సంపేట వరకు అడవి మార్గం ఉంటుంది. ఈ రూట్‌లో పోలీస్ చెకింగ్ తక్కువగా ఉంటుంది. కొత్తగూడెం దాటిన తర్వాత ఇల్లందు నుంచి గంగారం మీదుగా పాకాల అడవి మార్గంలో స్మగ్లర్లు ప్రయాణిస్తున్నారు. ఆ తర్వాత వరంగల్ నగరానికి చేరుస్తున్నారు. అక్కడి నుంచి ట్రైన్లలో ప్రయాణించి గంజాయిని గమ్య స్థానానికి చేరుస్తున్నారు. కొందరు వరంగల్ వెళ్లకుండా.. ములుగు, ఏటూరునాగారం, భూపాలపల్లి తరలించి అక్కడ ఉండే ఏజెంట్లకు విక్రయిస్తున్నారు.

ఇటీవల నర్సంపేటలో..

వరంగల్ జిల్లా నర్సంపేటలో ఇటీవల భారీగా గంజాయిని పట్టుకున్నారు. దాదాపు 7 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూపాలపల్లి నుంచి వేరే చోటకు తరలిస్తుండగా.. పట్టుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. నెక్కొండ రైల్వే స్టేషన్‌లో చెకింగ్ పెద్దగా ఉండదని.. అక్కడ ట్రైన్ ఎక్కి.. ప్రధాన నగరాలకు ఈజీగా రవాణా చేయొచ్చనే ప్లాన్‌లో గంజాయి స్మగ్లర్లు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.