Ganesh Nimarjanam: 24 చెరువులు 4,600 విగ్రహాలు, వరంగల్‌లో గణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లు-24 ponds 4 600 idols arrangements for immersion of lord ganesh at warangal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ganesh Nimarjanam: 24 చెరువులు 4,600 విగ్రహాలు, వరంగల్‌లో గణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లు

Ganesh Nimarjanam: 24 చెరువులు 4,600 విగ్రహాలు, వరంగల్‌లో గణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లు

HT Telugu Desk HT Telugu
Sep 13, 2024 11:34 AM IST

Ganesh Nimarjanam: వరంగల్ నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు సందడిగా కొనసాగుతున్నాయి. ఇంకో నాలుగు రోజుల్లో నిమజ్జనం నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా వరంగల్ ట్రై సిటీలోనే 4,600 కు పైగా గణనాథుడి విగ్రహాలు ప్రతిష్టించారు.

వరంగల్‌లో వినాయక చవితి నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు
వరంగల్‌లో వినాయక చవితి నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

Ganesh Nimarjanam: వరంగల్‌ నగరంలో ఏర్పాటు చేసిన 4600 గణేష‌‌ విగ్రహాల నిమజ్జనానికి నగరం చుట్టుపక్కల 24 చెరువులను గుర్తించారు. ఈ మేరకు నిమజ్జన క్రతువును సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఖైరతాబాద్ తరహాలోనే వరంగల్ నగరంలో ఈసారి భారీ విగ్రహాలు నెలకొల్పారు. ఖైరతాబాద్ విగ్రహం 70 అడుగుల పొడవు ఉండగా.. వరంగల్ మట్వాడా ఎల్లంబజార్ లో 40 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

వరంగల్ నగరంలో ఇంత పెద్ద విగ్రహాన్ని ప్రతిష్టించడం ఇదే మొదటిసారి కాగా..ఈ 40 అడుగుల విగ్రహాన్ని మట్టితో తయారు చేయించారు. వరంగల్ ఎల్లంబజార్ కు చెందిన ఆకుతోట సంజయ్ బాబు అనే వ్యక్తి రూ.20 లక్షల ఖర్చుతో ఒడిశాకు చెందిన జయదేవ్ అనే శిల్పితో ఈ భారీ విగ్రహాన్ని మట్టితో తయారు చేయించారు.

దీంతో పాటు 10 నుంచి 30 అడుగుల పొడవైన విగ్రహాలు కూడా వరంగల్ నగరంలో చాలానే ఉన్నాయి. మొత్తంగా 4,600కు పైగా విగ్రహాలు ఆన్ లైన్ లో నమోదై ఉండగా.. ఆ లెక్కల్లో పడని శివారు ప్రాంతాల విగ్రహాలు కూడా ఎన్నో ఉన్నాయి.

24 చెరువుల్లో నిమజ్జనం

వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన 4,600 విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిమజ్జనం ప్రక్రియ కొనసాగనుండగా.. ట్రై సిటీ వ్యాప్తంగా 24 చెరువులను పరిశీలించారు. అందులో ప్రధానంగా కట్ట మల్లన్న చెరువు, చిన్న వడ్డెపల్లి చెరువు, కోట చెరువు, ఉర్సు గుట్ట చెరువు(రంగ సముద్రం), బెస్తం చెరువు, పెద్ద చెరువు, అగర్తలా చెరువు, బంధం చెరువు, సిద్దేశ్వర గుండం, చల్లా చెరువు, గోపాల్ పూర్ చెరువు, భీమారం శ్యామల చెరువు, హసన్ పర్తి పెద్ద చెరువులు ప్రధానమైనవి.

మిగతావి నగర శివారు ప్రాంతంలోని చిన్న చెరువులున్నాయి. ఈ మేరకు గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే తదితరులు ఇరిగేషన్, పోలీస్, విద్యుత్తుశాఖ ఇతర డిపార్ట్ మెంట్ల అధికారులతో కలిసి పరిశీలించారు.

24 క్రేన్లు.. రెండు భారీ క్రేన్లు

వరంగల్ ట్రై సిటీ వ్యాప్తంగా నిమజ్జనానికి గుర్తించిన 24 చెరువుల వద్ద 24 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది సమన్వయంతో వాటిని అందుబాటులో పెడుతున్నారు. అంతేగాకుండా హైదరాబాద్ తరహాలో సిటీలో ఉన్న భారీ విగ్రహాల కోసం రెండు చెరువుల వద్ద రెండు భారీ క్రేన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

చెరువుల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు సీఎంహెచ్వో డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను కూడా రెడీ చేశారు. ఇక చెరువుల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా హైమాస్ట్ లైటింగ్ సిస్టం, తాగునీటి సౌకర్యం, బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు గుర్రపు డెక్క ఎక్కువగా ఉన్న చెరువులను శుభ్రం చేసే పనులు చేపడుతున్నారు.

చెరువులకు వెళ్లే రోడ్లు చాలావరకు దెబ్బ తినగా.. వాటి గుంతలను పూడ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 16వ తేదీ నుంచి నిమజ్జన ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఇప్పటి నుంచే అధికారులు సన్నద్ధమవుతున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner