Warangal : యథేచ్చగా రేషన్ బియ్యం దందా...! కొరఢా ఝుళిపించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు-task police force raids on pds rice gang in warangal district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal : యథేచ్చగా రేషన్ బియ్యం దందా...! కొరఢా ఝుళిపించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

Warangal : యథేచ్చగా రేషన్ బియ్యం దందా...! కొరఢా ఝుళిపించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

HT Telugu Desk HT Telugu
Sep 11, 2024 05:29 PM IST

పీడీఎస్ రైస్ దందాపై వరంగల్ కమిషనరేట్ పరిధిలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. పలుచోట్ల నిర్వహించిన సోదాల్లో రూ.13.41 లక్షల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే దందా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

పీడీఎస్ రైస్ దందాపై టాస్క్ ఫోర్స్ దాడులు
పీడీఎస్ రైస్ దందాపై టాస్క్ ఫోర్స్ దాడులు

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పీడీఎస్ రైస్ దందా జోరుగా నడుస్తోంది. రేషన్ షాపులతో పాటు లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేయడం, ఆ తరువాత ఎక్కువ రేటుతో ఇతర రాష్ట్రాలు, కోళ్ల ఫారాలకు తరలిస్తూ కొంతమంది దొడ్డిదారిన బిజినెస్ నడిపిస్తున్నారు. 

ఇటీవల కాలంలో ఈ దందా ఎక్కువ కావడంతో వరంగల్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ అక్రమ దందా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు కమిషనరేట్ పరిధిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి రూ.13 లక్షల 41 వేల విలువైన 516 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు.

వర్దన్నపేట మిల్లులో భారీ డంప్

ప్రభుత్వం పేదల కోసం ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రాంతంలో కొంతమంది పక్కదారి పట్టిస్తున్నారు. ఇలా అక్రమ దందా చేసే వారికి వర్ధన్నపేట శివారులోని మహేశ్వరి రైస్ మిల్ అడ్డాగా మారిందనే ఆరోపణలున్నాయి. 

వరంగల్ పోలీసులకు సమాచారం అందగా కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం స్పెషల్ రైడ్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని సేకరించి, వాహనాల్లో మహేశ్వరి మిల్కు తరలిస్తున్నట్లు గుర్తించారు. 

ఈ మేరకు వర్ధన్నపేట పోలీసుల సహాయంతో టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు పీడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న టీఎస్ 30 టీఏ1851 మహీంద్రా మినీ వాహనాన్ని పట్టుకోగా.. దాని డ్రైవర్ బాలు అనే యువకుడు పోలీసులు కండ్లు గప్పి పారిపోయాడు. అనంతరం మహేశ్వరి రైస్ మిల్లు ఓనర్ కొత్త రాజును అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత మిల్లును సోదా చెయ్యగా సుమారు 12 లక్షల 48 వేల విలువ గల 480 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడ్డాయి. దీంతో బియ్యాన్ని సీజ్ చేసి, నిందితుడిని విచారణ నిమిత్తం వర్ధన్నపేట పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.

మరో ఘటనలో 36 క్వింటాళ్లు

కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధి అయిన జనగామలో బియ్యం దందా అడ్డూఆపు లేకుండా నడుస్తోందనే ఆరోపణలున్నాయి. జనగామ మార్కెట్ ప్రాంతానికి చెందిన రోకళ్ల నాగులు అనే వ్యక్తి రేషన్ బియ్యం దందా చేస్తున్నట్టుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అందగా.. బుధవారం ఉదయం ఆయన ఇంటిపై రైడ్ చేశారు. అక్కడ అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ చేసి ఉంచగా.. టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

అక్కడ స్టోర్ చేసి ఉన్న దాదాపు రూ.93 వేల 600 విలువైన 36 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం జనగామ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ వివరించారు. ఈ తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ ఇన్ స్పెక్టర్ ఎస్‌.రవికుమార్‌, ఆర్ఎస్ఐ శరత్, ఇతర సిబ్బంది పాల్గొనగా.. వారిని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. కాగా పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే దందా చేస్తే.. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)