TS MLC Elections Notification : ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వురు నోటిఫికేషన్లు విడుదల - 2 సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకేనా..?
TS MLC Elections Notification 2024: శాసనమండలిలోని రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2 స్థానాలకు కూడా వేర్వురుగా నోటిఫికేషన్లు జారీ చేసింది.
TS MLC Elections Notification 2024 Updates : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. రెండు ఉపఎన్నికలు కావటంతో ఎన్నికల సంఘం వేరువేరుగా నోటిఫికేషన్లను ఇచ్చింది. ఇవాళ్టి నుంచి ఈనెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. జనవరి 29న పోలింగ్…. అదే రోజు ఫలితాలను ప్రకటించనుంది.
జనవరి 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 22 వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. జనవరి 29న పోలింగ్ ఉంటుంది. అదేరోజున సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఒకేనోటిఫికేషన్ విడుదలైతే… కాంగ్రెస్ కు ఒకటి, బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కేది. కానీ వేర్వేరు ఉప ఎన్నికలు కావడంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా కాంగ్రెస్ కే దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
గతంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంతో రెండు స్థానాలకు ఎన్నికల కమిషన్ ఉపఎన్నికలు నిర్వహిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో 119 మంది సభ్యులండగా... కాంగ్రెస్ కు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ కు 39 ఉండగా... బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎం పార్టీకి 7, సీపీఐ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఈనెల 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నారు.
కాంగ్రెస్ లో పోటీ…
ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉండటంతో అది ఎవరికి దక్కుతుందనే చర్చ జరుగుతోంది. శాసన సభ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వాస్తవానికి ఎమ్మెల్సీ పదవుల రేసులో వివిధ జిల్లాలకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఉన్నారు. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014, 2018, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్ 2023 ఎన్నికల్లోనూ టికెట్ ఆశించారు. కానీ, అధినాయకత్వం నచ్చచెప్పడంతో ఆయన తన టికెట్ ను త్యాగం చేశారు.
ఎమ్మెల్సీ పదవి హామీతోనే టికెట్ రేసు నుంచి పక్కకు తప్పుకున్నట్లు పార్టీ వర్గాల్లో ఓ అభిప్రాయం ఉంది. ఇపుడు ఎన్నికల షెడ్యూలు విడుదల కావండంతో మరో మారు అద్దంకి దయాకర్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారిలో షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, సంపత్, మధు యాష్కీ గౌడ్ వంటి నాయకులు వీరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఒక్క ముస్లిం మైనారిటీ నాయకుడు కూడా ఎమ్మెల్యేగా లేరు. అదే మాదిరిగా ఎమ్మెల్సీలు కూడా లేరు. మంత్రి వర్గంలోకి ఒక ముస్లిం మైనారిటీ నేతను తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలపై కన్నేసిన కాంగ్రెస్ కు ముస్లిం మైనారిటీ ఓట్లు కీలకం కానున్నాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసకుంటే ఈ ముగ్గురిలో ఒకరికి తక్షణం అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు.