Khammam DCCB : 'హస్తం' చేతికి ఖమ్మం 'డీసీసీబీ'...! ఈనెల 27న బల నిరూపణ
Khammam DCCB News: ఖమ్మం డీసీసీబీ హస్తం చేతిలోకి వెళ్లటం ఖాయంగానే కనిపిస్తోంది. డైరెక్టర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఈనెల 27వ తేదీన ఓటింగ్ జరగనుంది.
Khammam DCCB News: ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కాంగ్రెస్ ఖాతాలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. డీసీసీబీ చైర్మన్ గా ఉన్న కూరాకుల నాగభూషయ్య పై అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. జిల్లా కేంద్ర బ్యాంకులో (డీసీసీబీ) లో అవిశ్వాసం పెట్టకుండా చైర్మన్ కూరాకుల నాగభూషయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న వి. వెంకటాయపాలెం సొసైటీని కూల్చేందుకు కాంగ్రెస్ పెద్దలు పెద్ద ఎత్తున పావులు కదిపారు. ఈ సొసైటీలో అవిశ్వాసం నెగ్గితే సొసైటీలో నాగభూషయ్యకు ఛైర్మన్ పదవి పోతుంది. సొసైటీలో చైర్మన్ పదవి పోగానే డీసీసీబీలో చైర్మన్ హోదా కుప్ప కూలుతుంది. ఈ సూత్రాన్ని అవలంభిస్తూ కాంగ్రెస్ పార్టీ డీసీసీబీని కైవసం చేసుకోవాలని ఎత్తు వేసింది. పీఏసీఎస్ లో మొత్తం 13 మంది సభ్యులు ఉండగా అందులో 11 మంది తిరుగుబాటు స్వరం వినిపించారు. అవిశ్వాస తీర్మానం కాపీని సీఈవో కు అందజేసిన నాటి నుంచి 11 మంది డైరెక్టర్లను క్యాంపునకు తరలించారు.
27వ తేదీన ఓటింగ్..
సొసైటీలో చైర్మన్ కు వ్యతిరేకంగా ధిక్కారస్వరం వినిపించిన 11 మంది డైరెక్టర్లు గడిచిన 15 రోజులుగా వివిధ ప్రాంతాల్లో ఎవరికి దొరకకుండా విహార యాత్రలు కొనసాగిస్తున్నారు. 11 మందిలో ఏ ఒక్కరూ జారిపోకుండా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అత్యంత ప్రతిష్టమైన ఏర్పాట్లతో కాపాడుతోంది. సొసైటీలో మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా 11 మంది వ్యతిరేక స్వరం వినిపిస్తూ అవిశ్వాసం పెట్టారు. కాగా మరో ఇద్దరు సభ్యుల్లో చైర్మన్ నాగభూషయ్య ఒకరు కాగా మరో వ్యక్తి నాగభూశయ్య పక్షం వహిస్తున్నారు. అయితే ఆయన ఓటింగ్ సమయంలో తాను హాజరు కాలేనని చెప్పడం గమనార్హం. చైర్మన్ పక్షంలో ఉన్నప్పటికీ ఓటింగ్ లో పాల్గొనని పరిస్థితి ఏర్పడితే సొసైటీలో నాగభూషయ్య ఏకాకి అవుతారు. ఆయన ఒక్కరి మినహా మిగతా అందరూ కాంగ్రెస్ పక్షంలోనే ఉంటారు. దీంతో చైర్మన్ హోదా వీగిపోతుంది. బలం నిరూపించుకోని కారణంగా వివి పాలెం సొసైటీ చైర్మన్ హోదాను నాగభూషయ్య కోల్పోతారు. ఇదే జరిగితే జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఆయన నిర్వహిస్తున్న చైర్మన్ హోదా కుప్పకూలిపోతుంది.
రాజీనామా యోచన..
డిసిసిబి చైర్మన్ 27వ తేదీన బల నిరూపణ చేసుకోవాల్సి ఉండగా తాజాగా నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని చైర్మన్ కూరాకుల నాగభూషయ్య ముందుగానే చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 26వ తేదీన అంటే శుక్రవారం ఆయన తన పదవికి రాజీనామా చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వాస్తవానికి చైర్మన్ నాగభూషయ్య స్వతహాగా తన పదవికి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పన్నిన వ్యూహం మరింత తేలిక కానుంది. ఏది ఏమైనా రెండు రోజుల్లో డిసిసిబిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.