Telangana Ministers Portfolios : భట్టికి ఆర్థిక శాఖ, ఇరిగేషన్ ఉత్తమ్, ఐటీ శ్రీధర్ బాబు - మంత్రులకు కేటాయించిన శాఖలివే-new telangana ministers their portfolios finalized ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Ministers Portfolios : భట్టికి ఆర్థిక శాఖ, ఇరిగేషన్ ఉత్తమ్, ఐటీ శ్రీధర్ బాబు - మంత్రులకు కేటాయించిన శాఖలివే

Telangana Ministers Portfolios : భట్టికి ఆర్థిక శాఖ, ఇరిగేషన్ ఉత్తమ్, ఐటీ శ్రీధర్ బాబు - మంత్రులకు కేటాయించిన శాఖలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 09, 2023 10:13 AM IST

Telangana Ministers Portfolios : తెలంగాణ మంత్రుల శాఖలు ఖరారయ్యాయి. ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇప్పటికే వివరాలు గవర్నర్ వద్దకు చేరాయి. ఆ శాఖల వివరాలు ఇక్కడ చూడండి….

తెలంగాణ మంత్రుల శాఖలు
తెలంగాణ మంత్రుల శాఖలు (DD News Twitter)

Telangana Ministers Portfolios : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగా… గురువారం పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. అయితే శాఖల కేటాయింపు విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోని కాంగ్రెస్ ప్రభుత్వం…. శనివారం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రులకు శాఖలు కేటాయిస్తూ.. రాజ్ భవన్ కు వివరాలను పంపింది.

శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి… కాంగ్రెస్ పెద్దలను కలిశారు. మంత్రుల శాఖల కేటాయింపుతో పాటు మంత్రి పదవి ఖాళీలపై కూడా చర్చించారని తెసింది. రాత్రే హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి… శనివారం ఉదయమే శాఖల కేటాయింపునకు సంబంధించి… మంత్రులకు సమాచారం అందించారు. కీలకమైన హోంశాఖ, విద్యుత్ శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉండనున్నాయి.

మంత్రుల శాఖలు :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - మున్సిపల్, శాంతిభద్రతలతో పాటు కేటాయించని శాఖలన్నీ ముఖ్యమంత్రే చూడనున్నారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క- ఆర్థికశాఖ మంత్రి

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి - భారీ నీటిపారుదల శాఖ మంత్రి, పౌరసరఫరాలు

దుద్దిళ్ల శ్రీధర్‌బాబు- ఐటీ మంత్రి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - రోడ్లు, భవనాల శాఖ,సినిమాటోగ్రఫీ

సీతక్క- పంచాయతీరాజ్

కొండా సురేఖ- అటవీ శాఖ, దేవాదాయశాఖ

పొన్నం ప్రభాకర్‌- రవాణాశాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయశాఖ మంత్రి, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖ

జూపల్లి కృష్ణారావు- ఎక్సైజ్ శాఖ మంత్రి, టూరిజం & కల్చర్ మరియు ఆర్కియాలజీ.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- సమాచార శాఖ, రెవెన్యూ,గృహ నిర్మాణం

దామోదర రాజనర్సింహ- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

మరోవైపు ఆరు మంత్రి పదవి ఖాళీలపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఈ ఖాళీలను వెంటనే కాకుండా…. సమయం తీసుకొని భర్తీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తతం తెలంగాణ కేబినెట్ ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి ఏ ఒక్కరికి ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. ఫలితంగా ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు లేదా నేతలకు మంత్రి పదవులు దక్కే అకాశం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే కేవలం నాలుగింటిల్లో మాత్రమే హస్తం పార్టీ విజయం సాధించింది. వికారాబాద్ నుంచి గెలిచిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కు అసెంబ్లీ స్పీకర్‌గా అవకాశం దక్కింది. ఈ క్రమంలో ఈ జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అంతేకాకుండా…నిజామాబాద్ జిల్లా నుంచి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఒక్క సీటు గెలవకపోయినప్పటికీ… ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా - ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి(ఇబ్రహీంపట్నం), ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి(పరిగి)

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వివేక్ సోదరులతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు.

ఇక నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు పోటీ పడుతున్నారు. అయితే మైనార్టీ కోటాలో పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు ఉంటే, ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేదు. ఇక్కడ్నుంచి ఒక్కరికైనా అవకాశం ఉందని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తుంది. ఈ లిస్ట్ లో అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లితో పాటు అజహరుద్దీన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Whats_app_banner