TG Teachers Posting : తెలంగాణలో కొత్త టీచర్లకు పోస్టింగ్‌లు.. 10వ తేదీ నుంచే జీతాలు!-new teachers selected through dsc 2024 in telangana will be given postings today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Teachers Posting : తెలంగాణలో కొత్త టీచర్లకు పోస్టింగ్‌లు.. 10వ తేదీ నుంచే జీతాలు!

TG Teachers Posting : తెలంగాణలో కొత్త టీచర్లకు పోస్టింగ్‌లు.. 10వ తేదీ నుంచే జీతాలు!

Basani Shiva Kumar HT Telugu
Published Oct 15, 2024 09:28 AM IST

TG Teachers Posting : తెలంగాణలో కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు.. ఇవాళ విధుల్లో చేరనున్నారు. ఇటీవల ఎల్బీ స్టేడియం వేదికగా ఎంపికైన 10,006 మందికి నియామకపత్రాలను అందజేశారు. వారికి విద్యాశాఖ అధికారులు మంగళవారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.

తెలంగాణలో కొత్త టీచర్లకు పోస్టింగ్‌లు
తెలంగాణలో కొత్త టీచర్లకు పోస్టింగ్‌లు

తెలంగాణలో 2024 డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న 10,006 మంది కొత్త టీచర్లకు.. పాఠశాల విద్యాశాఖ అధికారులు ఇవాళ పోస్టింగులు ఇవ్వనున్నారు. నూతన టీచర్లు ఆయా డీఈవోలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఎక్కువగా కలెక్టరేట్లలోనే కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరగనుందని అధికారులు వెల్లడించారు.

ఎస్‌జీటీకి ఒక హాల్, స్కూల్‌ అసిస్టెంట్, ఇతర పోస్టులకు కలిపి మరో హాల్‌ ఏర్పాటు చేసినట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌లు కేటాయించనున్నారు. కొత్త టీచర్లు తమకు కేటాయించిన పాఠశాలల్లో ఈనెల 16వ తేదీన విధుల్లో చేరాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చేరిన స్థానంలో మూడు నెలల కిందట బదిలీ అయి రిలీవ్‌ కాని వారు ఉంటే.. వారు గత జులైలో కేటాయించిన పాఠశాలలకు వెళ్లనున్నారు.

సుమారు 7 వేల మంది రిలీవ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. పోస్టింగ్‌ల కేటాయింపు ఇవాళ దాదాపు పూర్తవుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏవైనా మిగిలితే.. వాటికి రేపు (16వ తేదీన) కూడా కౌన్సెలింగ్‌ జరుగుతుందని విద్యాశాఖ అధికారులు వివరించారు. కొత్తగా ఎంపికైన టీచర్లకు అక్టోబర్ 10వ తేదీ నుంచి జీతాలను లెక్కకట్టనున్నారు. ఈ తేదీని ప్రామాణికంగా తీసుకొని జీతాలను జమ చేస్తారు. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ల వివరాలను తీసుకుంటున్నారు.

ఎస్జీటీ పోస్టులకు ఎంపికైన వారికి మొత్తం జీతం రూ. 43,068గా నిర్ణయించారు. బేసిక్ పే 31,040, హెచ్‌ఆర్‌ఏ (11%) రూ.3,414, డీఏ (22.75%) 7,062, ఐఆర్‌ రూ.1,552గా ఉంది. స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు ఎంపికైన వారికి జీతం రూ. 58,691గా ఉంది. బేసిక్ పే రూ. 42,300గా ఉంది. హెచ్‌ఆర్‌ఏ (11%) రూ.4,653, డీఏ (22.75%) రూ.9,623, ఐఆర్‌ రూ.2,115గా నిర్ణయించారు.

విద్యాశాఖలోని మరికొన్ని టీచర్ ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఏమైనా ఖాళీలు ఉంటే.. వాటిని కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం.. వచ్చే నెల(నవంబర్)లో టెట్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. టెట్ రాత పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తారు. ఇక డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రకటన ఫిబ్రవరి 2025లో ఇస్తారు. అప్లికేషన్ల స్వీకరణ తర్వాత ఏప్రిల్ 2025లో పరీక్షలు నిర్వహిస్తారు.

Whats_app_banner