Vemulawada Fraud: వేములవాడలో బ్యాంక్ వద్ద యువకుడి చేతివాటం...వృద్ధుడికి బురిడీ కొట్టించేందుకు ప్రయత్నం
Vemulawada Fraud: వేములవాడలో బ్యాంకు వద్ద వృద్ధుడిని నమ్మించి మోసం చేశాడు యువకుడు. డ్రా చేసిన డబ్బులు లెక్కించి ఇస్తానని చెప్పి చేతివాటం ప్రదర్శించి 7 వేల మాయం చేశాడు. పారిపోయేందుకు యత్నించి అడ్డంగా దొరికి కటకటాల పాలయ్యాడు.
Vemulawada Fraud: వేములవాడ మున్సిపాలిటి పరిధిలోని శాత్రాజ్ పల్లి గ్రామానికి చెందిన గుడిసె మాణిక్యం యూనియన్ బ్యాంక్ లో రూ. 20 వేలు డ్రా చేశాడు. వాటిని బ్యాంక్ వారు లెక్కించి ఇచ్చినప్పటికీ వాటిని మళ్ళీ లెక్కించాలని ఓ దొంగ వృద్ధుడికి మాయమాటలు చెప్పి మళ్ళీ లెక్కించాలని చెప్పాడు. లెక్కించి ఇస్తానని చెప్పి రూ. 7వేలు తీసుకొని పరారయ్యాడు. అనుమానం వచ్చిన వృద్దుడు మళ్ళీ డబ్బులు లెక్కించగా 13వేలు మాత్రమే ఉన్నాయి. దీంతో మోసపోయానని గ్రహించి వృద్దుడు ఆవేదనతో ఆందోళన చెందుతూ బ్యాంక్ మేనేజర్ దృష్టి తీసుకెళ్ళాడు.
అప్రమత్తతో పట్టుబడ్డ దొంగ..
వృద్దుడు మాణిక్యం ఆవేదనతో బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. బ్యాంకులో వృద్ధుని చుట్టూ తిరుగుతూ డబ్బులు లెక్కించిన వ్యక్తిని గుర్తించారు. వెంటనే బ్యాంక్ సిబ్బంది రాజేష్ బస్టాండ్ తో పాటు పలు ప్రాంతాలో గాలించారు.
సీసీ కెమెరాల్లో గుర్తించిన యువకుడు వైన్ షాప్ వద్ద తచ్చాడడంతో వెంటనే వృద్దుడి వద్ద డబ్బులు లెక్కించి ఉడాయించిన వ్యక్తేనని గుర్తించారు. పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు...
వృద్ధుడిని మోసం చేసి డబ్బులతో పారిపోయేందుకు యత్నించి పట్టుబడ్డ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదివరకు ఎక్కడెక్కడ చోరీలు చేశాడు.. ఎంత మందిని మోసం చేశాడని ఆరా తీస్తున్నారు. బ్యాంకు సిబ్బంది అప్రమత్తతో మోసగాడు యువకుడు పట్టు పడ్డాడని పోలీసులు తెలిపారు. సకాలంలో స్పందించి మోసం చేసిన యువకుడిని పట్టుకున్న బ్యాంకు ఉద్యోగి రాజేష్, బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ ను పలువురు అభినందించారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)