Nagam Janardhan Reddy : కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్, సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా-nagar kurnool senior leader nagam janardhan reddy resigns to congress may join brs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nagam Janardhan Reddy : కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్, సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా

Nagam Janardhan Reddy : కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్, సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా

Bandaru Satyaprasad HT Telugu
Oct 29, 2023 04:12 PM IST

Nagam Janardhan Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన బీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

నాగం జనార్దన్ రెడ్డి
నాగం జనార్దన్ రెడ్డి

Nagam Janardhan Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేతల దృష్టికి తీసుకెళ్లినా టికెట్ పై హామీ దక్కకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డికి నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించింది కాంగ్రెస్. దీంతో ఆగ్రహానికి గురైన నాగం, తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఆదివారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఆదివారం తన రాజీనామా లేఖను పంపించారు. నాగం త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈరోజు సాయంత్రం మంత్రి హరీశ్ రావు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారని తెలుస్తోంది.

yearly horoscope entry point

బీఆర్ఎస్ లో చేరిన ఎర్ర శేఖర్

మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఎర్ర శేఖర్.. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎర్ర శేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఎర్ర శేఖర్ చేరికతో పాలమూరులో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని ఎర్ర శేఖర్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్ తో తనకు గొప్ప అనుబంధం ఉందని ఎర్రశేఖర్ తెలిపారు. గతంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్న కేసీఆర్ తో కలిసి పనిచేసిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ముదిరాజ్ లను ఆర్థిక స్థితిమంతులు చేశారు

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచేలా ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారని ఎర్ర శేఖర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యంగా ముదిరాజ్ లను ఆర్థికంగా స్థితి మంతులను చేసేందుకు చేపట్టిన కార్యక్రమాలను భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయేందుకు కేసీఆర్ నాయకత్వంలో నడిచేందుకు ఈరోజు పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. ఒకప్పుడు దయనీయంగా ఉన్న ముదిరాజ్ ల జీవితాలు బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం చేపట్టిన చేపల పంపిణీ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల వంటి కార్యక్రమాల వలన గుణాత్మక మార్పు వచ్చిందని, మత్స్య సంపద విపరీతంగా పెరిగిందని ఎర్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు బీసీల కోసం చేపట్టిన అనేక అద్భుతమైన కార్యక్రమాలు పట్ల కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ఎర్రశేఖర్. కేసీఆర్ నాయకత్వంలో భవిష్యత్తులో పనిచేస్తానని తెలిపారు.

Whats_app_banner