MLC Kavitha Delhi Tour : దిల్లీకి ఎమ్మెల్సీ కవిత.. విచారణకు హాజరవుతారా?
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిల్లీకి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) దిల్లీకి వెళ్లారు. కవితతోపాటుగా.. మంత్రి కేటీఆర్(KTR), ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. దిల్లీ మద్యం కేసు(Delhi Liquor Case)లో 20న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇదే సమయంలో ఆమె దిల్లీకి వెళ్లారు. విచారణకు ఆమె హాజరవుతారా? గతంలో మాదిరిగా.. న్యాయవాదిని పంపిస్తారా? అనేది చూడాలి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఈడీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. ఈడీ దర్యాప్తు అంశంపై ఇప్పటికే కవిత సుప్రీంను ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై మార్చి 24వ తేదీన కోర్టు విచారణ జరపనుంది. మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతర వ్యక్తం చేస్తూ.. పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సీజేఐ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, తక్షణమే విచారించేందుకు నిరాకరించింది. ఈ మేరకు ఈ నెల 24న వాదనలు వింటామని తెలిపింది. పిటిషన్ పెండింగ్ లో ఉండటం కారణంగా 16న విచారణకు కవిత(Kavitha) హాజరు కాలేదు. సుప్రీం తీర్పునకు ముందే మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె దిల్లీకి వెళ్లడం చర్చనీయాంశమైంది.
మరోవైపు కవిత తరఫు న్యాయవాది ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party)ని ఇబ్బంది పెట్టడానికే ఈడీ దర్యాప్తు పేరుతో వేధిస్తోందని కవిత తరపు న్యాయవాది ఆరోపించారు. కవిత తరపున ఈడీ కోరిన పలు డాక్యుమెంట్లను సమర్పించినట్లు సోమా భరత్ చెప్పారు. కవితను ఇబ్బంది పెట్టడానికే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మనీలాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50లో నిబంధనలకు విరుద్ధంగా విచారణ చేయడాన్ని ప్రశ్నించినట్లు అడ్వకేట్ తెలిపారు. ఈడీ కేసుల్లో నిందితులుగా, సాక్ష్యులుగా విచారించడానికి ఉన్న వారి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించి ప్రస్తుతం విచారణ జరిపారన్నారు. గతంలో పలు కేసుల్లో సుప్రీం కోర్టు(Supreme Court) ఆదేశాలు, చట్టాలను ధిక్కరించి ఈడీ అధికారులు వ్యవహరించారని, 15 ఏళ‌్లలోపు పిల్లలు ఉన్న మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు.
సంబంధిత కథనం