Miryalaguda Congress : మిర్యాలగూడలో కాంగ్రెస్, సీపీఎం పొత్తుల చిచ్చు-బీఎల్ఆర్ తిరుగుబాటు చేస్తారా?-miryalaguda congress leaders opposes cpm alliance blr may contest independent ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Miryalaguda Congress : మిర్యాలగూడలో కాంగ్రెస్, సీపీఎం పొత్తుల చిచ్చు-బీఎల్ఆర్ తిరుగుబాటు చేస్తారా?

Miryalaguda Congress : మిర్యాలగూడలో కాంగ్రెస్, సీపీఎం పొత్తుల చిచ్చు-బీఎల్ఆర్ తిరుగుబాటు చేస్తారా?

HT Telugu Desk HT Telugu
Oct 16, 2023 09:27 PM IST

Miryalaguda Congress : మిర్యాలగూడ కాంగ్రెస్ సీపీఎం పొత్తు చిచ్చుపెట్టాలే ఉంది. పొత్తులో భాగంగా మిర్యాలగూడ సీపీఎంకి కేటాయిస్తే టికెట్ ఆశిస్తు్న్న బత్తుల లక్ష్మారెడ్డి తిరుగుబాటు చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. దీంతో కాంగ్రెస్ రెండో జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మిర్యాలగూడ కాంగ్రెస్ నేత బీఎల్ఆర్
మిర్యాలగూడ కాంగ్రెస్ నేత బీఎల్ఆర్

Miryalaguda Congress :ఎన్నికల పొత్తు విషయంలో కాంగ్రెస్, వామపక్ష పార్టీల మధ్య రసవత్తరమైన ఎపిసోడ్ నడుస్తోంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐలు కలిసి నడవాలన్న సూత్రప్రాయ అంగీకారం ఈ పార్టీల మధ్య కుదిరింది. జాతీయ స్థాయిలో ‘ ఇండియా ’ కూటమిలో ఈ పార్టీలు కలిసే ఉన్నందున రాష్ట్ర ఎన్నికల్లో సైతం మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని ఆ పార్టీల జాతీయ నాయకత్వాలు నిర్ణయించాయి. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఈ పార్టీల మధ్య పొత్తులు పొసగడం లేదు.

yearly horoscope entry point

మిర్యాలగూడలో పొత్తుల చిచ్చు

ఈ ఎన్నికల్లో సీపీఎం రాష్ట్రంలో తమకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడ, రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రచాలం, పాలేరు స్థానాలను ఆశించింది. కానీ తమ పార్టీకి ఉన్న పరిమితుల రీత్యా మిర్యాలగూడ స్థానంతో పాటు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్లు చెబుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ అటు సీపీఐ, ఇటు సీపీఎంలకు ఇవ్వనున్న స్థానాల విషయంలో లీకు వార్తాలే కానీ, అధికారిక ఇంకా ప్రకటించనే లేదు. అయినా ఏఐసీసీ నాయకత్వం ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో మిర్యాలగూడకు స్థానం దక్కలేదు. దీంతో ఈ సీటును ఎన్నికల పొత్తులో భాగంగా సీపీఎంకే కేటాయిస్తున్నారన్న అభిప్రాయం బలపడింది. ఈ కారణంగానే కాంగ్రెస్ శ్రేణులు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ గళం వినిపిస్తున్నారు.

అసలేం జరుగుతోంది?

నియోజకవర్గాల వారీగా ఆశావహుల నుంచి టీపీసీసీ నాయకత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధికంగా 18 దరఖాస్తులు మిర్యాలగూడ నుంచే వెళ్లాయి. కానీ, ఇక్కడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్న బత్తుల లక్ష్మారెడ్డి (బి.ఎల్.ఆర్) టికెట్ కోసం ప్రధాన పోటీదారుగా ఉన్నారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ కుందూరు జానారెడ్డి పెద్ద తనయుడు రఘువీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ సహా పద్దెనిమిది మంది దరఖాస్తు చేశారు. ఇంత మంది దరఖాస్తు చేసుకోవడం వెనుక కూడా బి.ఎల్.ఆర్ కు టికెట్ రాకుండా అడ్డుకునే వ్యూహమేనన్న అభిప్రాయం ఆయన అనుచరవర్గంలో బలంగా ఉంది. ఉదయ్ పూర్ డిక్లరేషన్ మేరకు ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటికి ఫిట్ కాని కారణంగానే జానారెడ్డి చిన్న తయుడు జైవీర్ రెడ్డికి నాగార్జున సాగర్ టికెట్ ను ప్రకటించినా, మిర్యాలగూడలో మాత్రం రఘువీర్ రెడ్డికి టికెట్ ఇవ్వలేమని కాంగ్రెస్ నాయకత్వం తేల్చి చెప్పింది. ఇదే సమయంలో వామపక్షాల పొత్తులో భాగంగా సీపీఎం ఈ సీటును కేటాయించే అంశం జాతీయ నాయకుల మధ్య చర్చ జరిగింది. కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఉన్నందున తమకే టికెట్ కేటాయించాలన్నది కాంగ్రెస్ వర్గాల డిమాండ్ గా ఉంది.

బి.ఎల్.ఆర్ తిరుగుబాటు చేస్తారా?

గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి బీసీ సంఘం నాయకుడు, అప్పటి ఎల్.బి.నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్.క్రిష్ణయ్యను చివరి నిమిషంలో తీసుకువచ్చి పోటీకి పెట్టారు. ఓటమి పాలయ్యాక.. ఆయన ఒక్క రోజు కూడా మిర్యాలగూడ వైపు కన్నెత్తి చూడలేదు. ఒక విధంగా ఇక్కడ కాంగ్రెస్ కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఈ తరుణంలో మున్సిపల్ ఎన్నికలు వేదికగా అరంగేట్రం చేసిన బి.ఎల్.ఆర్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటున్నారు. మూడేళ్లకు పైగా నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లారు. ఈ కారణంగానే ఈసారి మిర్యాలగూడ టికెట్ తనకే వస్తుందన్న భరోసాతో ఉన్నారు. కానీ, ఈ స్థానాన్ని సీపీఎం కు కేటాయించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలపై బి.ఎల్.ఆర్ అనుచర వర్గం భగ్గుమంటోంది. తొలి జాబితాలో టికెట్ దక్కక పోవడం, మలి జాబితాలో కూడా టికెట్ వస్తుందన్న విశ్వాసం తగ్గిపోవడంతో ఆయన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.

సేవ్ కాంగ్రెస్... సేవ్ మిర్యాలగూడ నినాదంతో సమావేశం

ఈ పరిణామాల మధ్య బి.ఎల్.ఆర్ తన అనుయాయులతో సోమవారం మిర్యాలగూడలోని తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సేవ్ కాంగ్రెస్ .. సేవ్ మిర్యాలగూడ నినాదంతో ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అనుచర వర్గం ఒత్తిడి మేరకు ఇండిపెండెంటుగానైనా పోటీకి దిగాలన్న ప్రాథమిక నిర్ణయానిక వచ్చినట్లు చెబుతున్నారు. ‘‘ ఇంకా రెండో జాబితా ప్రకటించాల్సి ఉంది. వామపక్షాల పొత్తుపై అధికారికంగా ఇంకా ఏ నిర్ణయం వెలువడలేదు. పార్టీ నాయకత్వంపై నమ్మకం ఉంది. నాకు టికెట్ వస్తుందన్న విశ్వాసం కూడా ఉంది. అందుకే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని బత్తుల లక్ష్మారెడ్డి (బి.ఎల్.ఆర్) హెచ్.టి తెలుగుతో వ్యాఖ్యానించారు.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

Whats_app_banner