Minister Harish Rao - ఆయన అమిత్ షా కాదు, అబద్ధాల షా - హరీశ్ రావు
Minister Harish Rao News: తెలంగాణ పర్యటనలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఆయన అమిత్ షా కాదు… అబద్ధాల షా అంటూ కౌంటర్ ఇచ్చారు.
Minister Harish Rao On Amith Sha : కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆదిలాబాద్ బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగంపై స్పందిస్తూ…. ఆయన అమిత్ షా కాదు, అబద్దాల షా అంటూ దుయ్యబట్టారు. ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా నిజంలేదన్నారు. కేంద్ర మంత్రి గిరిజన యూనివర్సిటీకి తెలంగాణ ప్రభుత్వం భూమి ఇవ్వటం లేదని ఆరోపించారని…. అందులో అసలు ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశార. 2016 లోనే తెలంగాణ ప్రభుత్వం ములుగు జిల్లాలో రెండు ప్రాంతాల్లో భూమి గుర్తించి… కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ బృందం 2017 ఫిబ్రవరి 13న వచ్చి భూములను పరిశీలించి, ములుగులో భూములు అనుకూలంగా ఉన్నాయని నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపకుండా పెండింగ్ పెట్టిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటుకు 335.04 ఎకరాలను కేటాయించిందన్నారు మంత్రి హరీశ్. తాత్కాలిక తరగతుల కోసం ములుగులోని యూత్ ట్రెయినింగ్ సెంటర్ భవనాలను కూడా ఇస్తామని అని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని… అయినా కేంద్రం పట్టించుకోలేదని గుర్తు చేశారు. దాదాపు ఏడేండ్లుగా నాన్చుతున్న కేంద్రం ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి కోసం హడావుడిగా ప్రకటన చేసి గొప్పలు చెప్పుకుంటున్నదని ఎద్దేవా చేశారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందనడం అమిత్ షా అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని అన్నారు. మీ పరిధిలోని కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం,మహారాష్ట్రలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని స్వయంగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్ సభలో చెప్పారని తెలిపారు. అయినా తెలంగాణను బదనాం చేయడం సిగ్గుపడాల్సిన విషయమని… అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
అమిత్ షా కి తెలియదా?
రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను పట్టించుకోలేదని అమిత్ షా విమర్శించడం తన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 1.51లక్షల మంది గిరిజన రైతులకు 4 లక్షల ఎకరాల పోదు పట్టాలు ఇచ్చిందని అన్నారు. గిరిజనుల రిజర్వేషన్ ను 6 నుంచి 10 శాతానికి పెంచింది తెలియదా? హైదరాబాద్ నడిబొడ్డున కట్టిన ఆత్మ గౌరవ భవనాలు కనిపిస్తలేవా? మా తండా, మా రాజ్యం అనే నినాదాన్ని సాకారం చేస్తూ ఏర్పాటు చేసిన కొత్త గ్రామ పంచాయితీలు కనిపిస్తలేవా? అని అమిత్ షా ని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ చేపట్టి రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇస్తుంటే.. కేంద్రం ఇస్తున్నట్టు అమిత్ షా చెప్పుకోవడం దురదృష్టకరం, అని అన్నారు.
రైతుబంధును కాపీ కొట్టి కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో అమలు చేస్తోందన్నారు హరీశ్ రావు. “ఒక్కో రైతుకు కేవలం సంవత్సరానికి రూ.6వేలు ఇస్తోంది. ఎకరాకు రూ.10వేలు ఇస్తున్న సీఎం కేసీఆర్‌ను అభినందించాల్సింది పోయి.. కేంద్రం ఏదో గొప్పగా ఇస్తున్నట్టు బిల్డప్ ఎందుకు? తెలంగాణకు రాగానే కుటుంబ పాలన, ఎంఐఎం అంటూ రొటీన్ ఉపన్యాసాలు ఇంకా ఎన్నాళ్లు ఇస్తారు..? కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలి. తెలంగాణకు చేసిందేమీ లేదు కాబట్టే…. చెప్పుకోవడానికి ఏమీ లేక కేంద్ర మంత్రి ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి మోసపూరిత మాటలను ప్రజలు నమ్మరని, తెలంగాణకు ఎవరు కావాలో స్పష్టత ఉంది” అని మంత్రి హరీశ్ రావు అన్నారు .