Parvathi Barrage : కోతకు గురైన పార్వతి బ్యారేజీ కరకట్ట, అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం
Parvathi Barrage : ప్రాజెక్టుల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పార్వతి బ్యారేజీ కరకట్ట కోతకు గురైంది. అయితే వర్షాకాలంలో మరమ్మత్తు పనులు చేపట్టడంతో...పనులకు అంతరాయం ఏర్పడింది. దీంతో బ్యారేజీ 65 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
Parvathi Barrage : కాళేశ్వరం ప్రాజెక్టు వివాదాస్పదంగా మారి కమిషన్ ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజీ కరకట్టకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. గతంలో కరకట్ట కొంత కోతకు గురికాగా ఇంతకాలం నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు మరమ్మత్తు పనులు చేపట్టారు. అయితే వర్షంతో పనులకు అంతరాయం ఏర్పడి కరకట్ట కోత కాస్త ఎక్కువైంది. అప్రమత్తమైన అధికారులు బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తి వచ్చిన వరద వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.
వర్షంతో మరమ్మత్తు పనులకు అంతరాయం
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పియర్స్ కుంగి కాళేశ్వరం ప్రాజెక్టు అభాసుపాలైంది. రాజకీయ విమర్శలకు కాళేశ్వరం ప్రాజెక్టు వేదికగా మారడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపిస్తున్నారు. ఓవైపు విచారణ జరుగుతుండగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం సరస్వతి బ్యారేజీ, సుందిళ్ల పార్వతి బ్యారేజీలను సైతం పరిశీలించారు. పార్వతి బ్యారేజీ కరకట్ట కాస్త కోతకు గురి కావడంతో వెంటనే మరమ్మత్తు పనులు చేయాలని నిర్ణయించారు. సమ్మర్ లో చేయాల్సిన పనులు సకాలంలో చేయకపోగా ఇటీవల రాళ్లతో గోడ నిర్మించే పనులు చేపట్టారు. ఆ పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పనులకు అంతరాయం ఏర్పడి కరకట్ట కోత కాస్త ఎక్కువైంది. అధికారులు మాత్రం ప్రమాదం ఏమీ లేదు అంటున్నారు. ప్రస్తుతం స్వల్పంగా ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుండడంతో 65 గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. వర్షం తగ్గాక మరమ్మత్తు పనులు ముమ్మరంగా చేపడతామని అధికారులు ప్రకటించారు.
గోదావరిలో పెరుగుతున్న వరద
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న జోరువానతో జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గంట గంటకు క్రమంగా వరద పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 16 వేలకు పైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. 20.175 టీఎంసీ నీటి సామర్థ్యం గల ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 6.367 టిఎంసీలకు చేరింది. ధర్మపురి వద్ద గోదావరిలో క్రమంగా వరద పెరుగుతుంది. లోయర్ మానేరు డ్యాం, మధ్య మానేర్ రాజరాజేశ్వర రిజర్వాయర్, అప్పర్ మానేర్ నర్మాల ప్రాజెక్టులకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతుంది.
రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం