Sarurnagar Murder: చుడీదార్ వేసుకుందని భార్యను చంపేశాడు, సరూర్నగర్లో దారుణం.. ప్రకాశం జిల్లా యువతి హత్య
Sarurnagar Murder: హైదరాబాద్లో దారుణం జరిగింది. భార్య చుడీదార్ వేసుకోవడం సహించని భర్త ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. ఆపై ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసుల విచారణలో భర్తే భార్యను హతమార్చినట్టు గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Sarurnagar Murder: భార్యపై అనుమానం, చుడీదార్ వేసుకుని ఇళ్లలో పనిచేయడానికి వెళుతోందనే అక్కసుతో దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. భార్యను హత్య చేసిన తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
ప్రకాశం జిల్లా కొంజేడుకు చెందిన గుంజి వెంకటేశ్ -సోనీ దంప తులు ఉపాధి కోసం హైదరాబాద్ వలస వచ్చారు.నగరంలోని కొత్త పేట సరస్వతీనగర్లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటేశ్ భవన నిర్మాణ పనులకు మేస్త్రీగా పనిచేస్తున్నాడు. సోని చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేస్తోంది.
భార్య సోనీ ప్రవర్తనను వెంకటేష్ అనుమానిస్తుండటంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోనీ ఇటీవల ఇళ్లలో పనికి వెళ్లే సమయంలో చుడీదార్ వేసుకోవడంతో భర్త ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆదివారం మధ్యాహ్నం ఓ ఇంట్లో పని చేయడానికి వెళ్లిన భార్యను అక్కడి నుంచి ఇంటికి తీసుకు వచ్చాడు. ఆ సమయంలో మళ్లీ గొడవ జరగడంతో తాను వద్దంటున్న చుడీదార్ ధరిస్తోందని ఆగ్రహంతో పంజాబీ డ్రైస్ చింపేశాడు.
ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రం కావడంతో కూరగాయలు కోసే కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో వెంకటేష్ చేతికి కూడా గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఇద్దరి మధ్య గొడవ జరిగిన క్రమంలో భార్య తనపై దాడి చేసిందని ఆవేశంతో పొడుచుకుని చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. భార్య వల్ల తనకు కూడా గాయాలయ్యాయని బుకాయించాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించే క్రమంలో పోలీసులు మృతురాలి వీపు భాగంలో కూడా కత్తి పోట్లు ఉండటంతో, భర్తే ఆమెను హత్య చేసినట్టు నిర్ధారించుకుని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
మద్యం మత్తులో నగ్నంగా రోడ్డుపై మహిళ..
తప్పతాడి రోడ్లపై పడిపోయే మందుబాబులు తరచూ కనిపిస్తుంటారు కానీ హైదరాబాద్లో ఓ మహిళ పీకలదాకా తాగి ఒంటిపై దుస్తులు కూడా లేకుండా రోడ్డుపై పడి ఉండటం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో మహిళను ఆస్పత్రికి తరలించిన పోలీసులు మద్యం అధికంగా సేవించినట్టు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
బంజార్ హిల్స్ ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన 40ఏళ్ల మహిళ రోడ్డుపై దుస్తులు లేకుండా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ కొంత కాలంగా మద్యానికి బానిసగా మారినట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. శనివారం తెల్లవారుజామున రోడ్డుపై నగ్నంగా పడి ఉండటంతో పోలీసులకు సమాచారం అందింది. 108 వాహనంలో ఆమెనున ఆస్పత్రికి తరలించారు.
ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అధికంగా మద్యం సేవించినట్టు గుర్తించి, ఆమె నుంచి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తాగిన మైకంలో ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్టు కుటుంబ సభ్యులు వివరించడంతో ఆమెను హెచ్చరించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వ్యక్తిగత సమస్యలతో మద్యానికి బానిసైనట్టు పోలీసులకు తెలిపింది.