Telangana ACB : రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన డీఈవో.. ఇదేం కక్కుర్తి!-mahabubnagar deo caught by telangana acb while taking a bribe of rupees 50 thousand ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Acb : రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన డీఈవో.. ఇదేం కక్కుర్తి!

Telangana ACB : రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన డీఈవో.. ఇదేం కక్కుర్తి!

Basani Shiva Kumar HT Telugu
Nov 07, 2024 04:01 PM IST

Telangana ACB : తెలంగాణ ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. లంచగొండి అధికారుల భరతం పడుతోంది. నిత్యం ఏదో ఒకచోట దాడులు చేస్తూ.. అవినీతి అధికారులను కటకటాల్లోకి పంపుతోంది. తాజాగా.. లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా ఓ డీఈవోను పట్టుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఏసీబీకి పట్టుబడిన డీఈవో రవిందర్
ఏసీబీకి పట్టుబడిన డీఈవో రవిందర్ (@TelanganaACB)

మహబూబ్ నగర్ జిల్లా డీఈవో రవీందర్ ఒక ఉపాధ్యాయుడి భర్త నుంచి లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక టీచర్‌కు దక్కాల్సిన సీనియారిటీ దక్కకపోవడంతో తనకు న్యాయం చేయాలని పలుమార్లు డీఈవోకు విజ్ఞప్తి చేశారు. అయితే.. అందుకు డీఈవో 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ టీచర్, ఆమె భర్త ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

పథకం ప్రకారం గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఉన్న డీఈవో ఇంటికి వెళ్లి.. 50 వేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారుల బృందం పట్టుకుంది. డీఈవోను అదుపులోకి తీసుకుంది. 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకొని.. ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఎవరైనా సంచం డిమాండ్ చేస్తే.. 1064 నంబర్‌కు ఫోన్ చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.

నవంబర్ 5వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పుల్లయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం ఎన్‌వోసీ ఇవ్వడానికి పుల్లయ్య రూ.18వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. పథకం ప్రకారం రూ.18 వేలు ఇస్తుండగా పుల్లయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

నవంబర్ 2వ తేదీన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు లంచగొండి అధికారులను ఏసీబీ టీమ్ పట్టుకుంది. ఓ వ్యక్తి రూ.9.10 లక్షల విలువైన సీసీ రోడ్డు పనులు చేశారు. దానికి సంబంధించిన చెక్కును ఇవ్వడానికి పోచంలొద్ది (గ్రామ పంచాయతీ) ప్రత్యేక అధికారి డి.తిరుపతి, జండాగూడెం, పోచంలొద్ది గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం.శేఖర్ రూ.12000 లంచం డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ వీరిని పట్టుకుంది.

అక్టోబర్ 29వ తేదీన హైదరాబాద్ నగరంలో మరో లంచగొండి అధికారిని ఏసీబీ బృందం పట్టుకుంది. చేసిన పనిని ఎంబుక్‌లో నమోదు చేయడం కోసం.. జీహెచ్ఎంసీ 11వ సర్కిల్, రాజేంద్రనగర్‌ ఏఈఈ వెంకొబా.. రూ.50 వేలు డిమాండ్ చేశారు. దీంతో పనులు చేసిన గుత్తేదారు.. ఏసీబీని ఆశ్రయించారు. డబ్బులు తీసుకుంటుండగా.. వెంకొబాను అధికారులు పట్టుకున్నారు.

ఇలా.. ప్రతీరోజూ ఏదో ఒకచోట అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేసి.. లంచగొడి ఆఫీసర్లను పట్టుకుంటున్నారు. ఎవరైనా అధికారి డబ్బులు డిమాండ్ చేస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేస్తున్నారు.

Whats_app_banner